Tirumala Devotees Rush
* సర్వదర్శనానికి 30 గంటల సమయం
ఆకేరు న్యూస్, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. దీంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు భారీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.
నిన్న తిరుమల శ్రీవారిని 78,445 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తుల్లో 40,098 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.3 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు క్యూలైన్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తాగునీరు, అన్నప్రసాదం, ఇతర సౌకర్యాలను భక్తులకు అందిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా దర్శన ప్రక్రియను కొనసాగిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి బయటకు కూడా క్యూలైన్లు కొనసాగుతున్న నేపథ్యంలో, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనానికి తగినంత సమయం కేటాయించుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
అలాగే రద్దీ నియంత్రణలో భాగంగా రేపు సిఫార్సు లేఖల స్వీకరణను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు టీటీడీ సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
