Telangana Electricity Bills
* నవంబర్ నుంచే ‘ట్రూ-అప్’ వసూలు..
* యూనిట్‌కు 50 పైసలు పైకి
* రైతులకు మినహాయింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై మరో భారీ ఆర్థిక భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం, రెవెన్యూ లోటును సర్దుబాటు చేసేందుకు గానూ భారీ మొత్తంలో ‘ట్రూ-అప్’ (True-Up Charges) ఛార్జీలను వసూలు చేసుకునేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) డిస్కమ్‌లకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
*మొత్తం రూ.7,635 కోట్ల ఆమోదం
2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం (రూ.5,186.29 కోట్లు), 2023-24కి సంబంధించి ఏర్పడిన రెవెన్యూ లోటు (రూ.2,448.93 కోట్లు) భారాన్ని భర్తీ చేసేందుకు డిస్కమ్‌లు ప్రతిపాదనలు సమర్పించగా, మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ వసూలుకు TGERC ఆమోదం తెలిపింది.
*రైతులకు మినహాయింపు
రాష్ట్రంలో అమలులో ఉన్న ఉచిత విద్యుత్ విధానం దృష్ట్యా వ్యవసాయ రంగానికి వర్తించే రూ.2,214.99 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లించాలని TGERC స్పష్టం చేసింది. దీంతో రైతులపై నేరుగా ఎలాంటి అదనపు భారం పడదు.
సామాన్యులపై భారం : మిగిలిన రూ.5,420.23 కోట్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక (వ్యవసాయేతర) వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కమ్‌లకు పచ్చజెండా ఊపింది.
* ఏ డిస్కం పరిధిలో ఎంత వసూలు అంటే
దక్షిణ డిస్కం (TGSPDCL): రూ.4,222.93 కోట్లు (రాబోయే 29 నెలల పాటు వసూలు)
ఉత్తర డిస్కం (TGNPDCL): రూ.1,197.30 కోట్లు (రాబోయే 26 నెలల పాటు వసూలు)
నవంబర్ బిల్లుల నుంచే వసూలు.. యూనిట్‌కు ఎంత పెరగనుందంటే.. నవంబర్ నెల నుంచి జారీ చేసే విద్యుత్ బిల్లుల నుంచే ఈ ట్రూ-అప్ ఛార్జీల వసూలు ప్రారంభమవుతుంది.
తొలి నెలలో (నవంబర్): యూనిట్‌కు 30 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. (ఉదాహరణకు 100 యూనిట్లు వాడితే రూ.30 అదనపు భారం).
రెండో నెల నుండి (డిసెంబర్ నుండి): యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు చేస్తారు. (100 యూనిట్లకు రూ.50 అదనంగా పడుతుంది).
* సుప్రీంకోర్టు తీర్పుతో తెరపైకి
వాస్తవానికి ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో కోరడంతో టీజీఈఆర్సీ ఈ ప్రక్రియను నిలిపివేసింది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ తుది ఉత్తర్వులు వెలువరించింది.
* బిల్లులో స్పష్టమైన వివరాలు ఉండాలి
సాధారణ విద్యుత్ టారిఫ్‌తో ఈ ట్రూ-అప్ను ఏమాత్రం కలపకూడదని, ప్రతి నెలా ఇచ్చే బిల్లులో ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది, ఎంత వినియోగం జరిగింది, వర్తింపజేసిన యూనిట్ రేటు ఎంత అనే వివరాలను విడిగా (ప్రత్యేకంగా) చూపించాలని TGERC నిబంధన విధించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
