Warangal Husband Tower Incident Husband Family Dispute
* గంటల పాటు ఫోన్ కాల్
* ఎస్సై సాహసోపేత యత్నం
ఆకేరు న్యూస్, వరంగల్ : భార్య పుట్టింటి నుంచి కాపురానికి తిరిగి రావట్లేదన్న మనోవేదనతో ఒక వ్యక్తి ఏకంగా హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి కలకలం సృష్టించిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు నరసింగపురం తండాకు చెందిన భూక్య రవికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే, గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన భార్య భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి తీసుకురావడానికి భూక్య రవి పలుమార్లు ప్రయత్నించాడు. ఎంత నచ్చజెప్పినా, ఎన్నిసార్లు పిలిచినా ఆమె తిరిగి రావడానికి అంగీకరించకపోవడంతో రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
* 33 కేవీ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హైడ్రామా
తీవ్ర నిరాశ, బాధలో ఉన్న రవి.. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లి శివారులోని 33 కేవీ విద్యుత్ ప్రసార టవర్ ఎక్కేశాడు. టవర్ పై భాగంలో ప్రమాదకరంగా నిలబడి నిరసన తెలపడం ప్రారంభించాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
* చాకచక్యంగా కాపాడిన ఎస్సై
సమాచారం అందుకున్న వెంటనే రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రవి విద్యుత్ టవర్ పైనుంచి కిందకు దూకుతానని బెదిరించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. అయితే, ఎస్సై ముత్యం రాజేందర్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. సమస్యను కోపంతో కాకుండా శాంతియుతంగా పరిష్కరించవచ్చని ఫోన్ ద్వారా రవికి దాదాపు రెండు గంటల పాటు నచ్చజెప్పారు. భార్యతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, కౌన్సెలింగ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై మాటలపై నమ్మకంతో రవి సురక్షితంగా విద్యుత్ టవర్ కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రవికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
