Indian Woman Cricketer Harmanpreet Kaur
* తదుపరి కెప్టెన్ ఎవరు?
* స్మృతి పేరు పరిశీలనలో
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆటగాళిగా మరికొంత కాలం కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత్ 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌తో పాటు ఇటీవల ముగిసిన 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో ఇకపై బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టే అవకాశం ఆమెకు లభించనుంది.
* ఈ నిర్ణయం అంత సులభం కాదు
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదని హర్మన్‌ప్రీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు కోసం తన రక్తం, చెమట, సమయాన్ని ధారపోశానని ఆమె తెలిపారు. జట్టు ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో తన వ్యక్తిగత ఆశయాలను, ఆటను కూడా పక్కన పెట్టానని పేర్కొన్నారు.
* ఎన్నో విజయాలు
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత మహిళల జట్టు పలు కీలక విజయాలు సాధించింది. 2025 వన్డే ప్రపంచకప్, 2026 ఆసియా క్రీడల స్వర్ణంతో పాటు 2012, 2016, 2022 మహిళల ఆసియా కప్‌లలోనూ భారత్ టైటిళ్లు సాధించింది. 2022 ఆసియా క్రీడల్లోనూ భారత జట్టు స్వర్ణం గెలిచింది. 2026లో హర్మన్‌ప్రీత్ మరో అరుదైన ఘనత సాధించారు. ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్‌గా నిలిచారు.
* కెప్టెన్‌గా హర్మన్ గణాంకాలు
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సారథ్యం వహించారు. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు కూడా ఆమె పేరిట ఉంది. ఫ్రాంచైజీ క్రికెట్లోనూ ఆమె సత్తా చాటారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రెండు టైటిళ్లు అందించారు.
* ఎవరనేది నిర్ణయించాల్సి ఉంది
హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో భారత మహిళల జట్టుకు తదుపరి సారథి ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన పేరు తదుపరి కెప్టెన్సీ కోసం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
* బీసీసీఐ సమీక్ష సమావేశం
గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం వెలువడినట్లు సమాచారం. ఈ సమావేశంలో హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.
