* జర్నలిజం విద్యార్థులకు సీనియర్ జర్నలిస్టుల సూచనలు
Media Manthan 2026| ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో ‘మీడియా మంథన్ – 2026’ సెమినార్, వర్క్‌షాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వీసీ వెల్దండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సహకారంతో, డీన్ ఆచార్య బి.హెచ్. పద్మప్రియ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకకు విద్యార్థులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుండవజ్జుల జ్యోతిర్మయి, నోముల తిరుమల్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
విజ్ఞత, విచక్షణ, నైతికత కీలకం
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ గుండవజ్జుల జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో విజ్ఞత, విచక్షణ, నైతికత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సాంకేతికతను కేవలం అభివృద్ధి కోసం కాకుండా మానవాళి సంక్షేమానికి, మనిషి సామర్థ్యాలను పెంచే సాధనంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ అందించే సమాచారాన్ని యథాతథంగా నమ్మకుండా వాస్తవాలతో సరిపోల్చుకోవాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా నైతికతను పాటించాలని ఆమె సూచించారు.
యూట్యూబ్ యుగంలో డిజిటల్ జర్నలిజం
మరో అతిథి, కంటెంట్ క్రియేటర్ నోముల తిరుమల్ రెడ్డి ‘యూట్యూబ్ యుగంలో డిజిటల్ జర్నలిజం’ అంశంపై మాట్లాడుతూ డిజిటల్ వేదికలు మారుతున్న తీరును వివరించారు. తన 23 ఏళ్ల మీడియా అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ, కంటెంట్ ఎంపిక, ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం, ఆదాయ మార్గాలపై విలువైన సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించి పుస్తకాలను బహుకరించగా, ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. జర్నలిజం విద్యార్థులు సంపాదకత్వం వహించి.. అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించిన గురు దక్షిణ కవితా సంకలన పుస్తకాన్ని అతిథులకు బహుమతిగా అందజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
