Amma Foundation
* మిత్రుడి జ్ఞాపకార్థం అనాథలకు అన్నదానం
ఆకేరు న్యూస్, పాలకుర్తి : స్నేహం అంటే కేవలం కాలక్షేపాలు, సరదాలు మాత్రమే కాదు.. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, దూరమైన మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో నిరంతరం సజీవంగా నిలపడమే నిజమైన మైత్రి అని నిరూపించారు ఆ యువకులు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన ఎదునూరి రాజేష్ అకాల మరణం చెంది నేటికి ఏడాదవుతున్నా, ఆయనతో ఉన్న ప్రేమానురాగాలను, చెరగని జ్ఞాపకాలను సేవా దృక్పథంతో సమాజానికి అంకితం చేశారు ఆయన ప్రాణస్నేహితులు.
బుధవారం ఎదునూరి రాజేష్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం మిత్రుడి ఆత్మకు శాంతి చేకూరాలనే సత్సంకల్పంతో, సమాజంలో ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కడుపు నింపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మిత్రబృందం అంతా కలిసి ‘అమ్మ ఫౌండేషన్ (Amma Foundation) ‘ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు.
ఆశ్రమంలోని చిన్నారులకు రాజేష్ జ్ఞాపకార్థం స్వయంగా విందు భోజనాలు వడ్డించి, వారి ఆనందంలో తమ మిత్రుడి రూపాన్ని చూసుకున్నారు. పిల్లలతో కొంత సమయం గడిపి, వారి చిరునవ్వుల్లో తమ స్నేహబంధం యొక్క పరమార్థాన్ని వెతుక్కున్నారు.
మిత్రుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పేరున చేసే ప్రతీ సేవా కార్యక్రమం ద్వారా రాజేష్ నిత్యం తమతోనే ఉంటాడని ఈ సందర్భంగా స్నేహితులు భావోద్వేగంతో తెలిపారు.
స్నేహానికి కొత్త అర్థాన్ని చెబుతూ, సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమంలో రాజేష్ ప్రాణస్నేహితులు మాచర్ల సునీల్, దుస్సా హరీష్, లోంక శివమణి, పడాల నరేష్, పొన్నం వెంకటేష్, దుస్సా ప్రవీణ్‌లతో పాటు పలువురు స్థానిక యువకులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
