CM Breakfast Scheme
* విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
* విద్యార్థుల భవిష్యత్తుకే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం
ఆకేరు న్యూస్, వరంగల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు స్పష్టం చేశారు.
బుధవారం హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఉదయం ఆకలితో ఉండే విద్యార్థులకు కొండంత అండ..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయాన్నే అల్పాహారం తినకుండా ఆకలితో పాఠశాలలకు వస్తున్నారనే విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
మెనూ ప్రకారం రోజువారీగా ఇడ్లీ, మిల్లెట్స్, పూరి, ఉప్మా వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచడంతో పాటు పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని గుర్తుచేశారు.
హసన్పర్తిలో రూ.6.80 కోట్లతో పబ్లిక్ స్కూల్..
విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ ఎమ్మెల్యే నాగరాజు పలు కీలక ప్రకటనలు చేశారు.. హసన్పర్తిలోని పీఎం శ్రీ బాలికల పాఠశాలను రూ. 6.80 కోట్ల వ్యయంతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’గా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు.
ప్రాంతీయంగా క్రీడలను ప్రోత్సహించేందుకు 35 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కానుందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు.
ఇందులో ఇండోర్ స్టేడియం, హాకీ, షటిల్, బాక్సింగ్ వంటి అన్ని రకాల క్రీడా సదుపాయాలు ఉంటాయని చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మాణం ఉప్పరపల్లి క్రాస్ వద్ద వేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలల్లో డ్రాపౌట్లను అరికట్టాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి లబ్ధి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ విద్య అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం బ్రేక్ఫాస్ట్..
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారాన్ని అందించే ఇటువంటి వినూత్న పథకం దేశంలో మరెక్కడా లేదని కొనియాడారు.
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై హాజరు శాతాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక వర్క్ బుక్స్ అందుబాటులోకి వచ్చాయని, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థులతో టిఫిన్ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్..
కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలోని మెట్లపై విద్యార్థుల సరసన కూర్చుని అల్పాహారాన్ని భుజించారు.
ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ చదువు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధి, కలెక్టర్ తమతో కలిసి సాధారణంగా కూర్చుని టిఫిన్ చేయడంతో విద్యార్థులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్, తహసిల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో సుమన వాణి, పాఠశాలల హెచ్ఎంలు సుమాదేవి, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
