Jeffrey Archer
* అప్పుల నుంచి అక్షరాల సామ్రాజ్యం వరకు..
* చివరి నవల విడుదలకు ఒక్కరోజు ముందే కన్నుమూత
* చేదు అనుభవాలే స్టోరీ లైన్ ..
– జెఫ్రీ ఆర్చర్ జీవితంలో అన్నీ మలుపులే
ఆకేరు న్యూస్, ప్రత్యేక కథనం:
పుట్టుకతో ఎవరూ రచయితలు కాలేరు.. కఠిన జీవితానుభవాలే రచయితను చేస్తాయి. కష్టాలతో, కన్నీళ్లతో కలం పట్టిన చేతుల్లోంచే అద్భుత అక్షరధారలు ప్రవహించి మనుషులను కుదుపేస్తాయి. అలా అనుకోకుండా రచయిత అయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయితగా ఎదిగిన వాడు జెఫ్రీ ఆర్చర్( Jeffrey Archer ). బ్రిటన్‌కు చెందిన ఆర్చర్ జీవితం అనేక మలుపులు తిరుగుతూ.. సామాన్యులకు ఆయనే ఓ సజీవ కావ్యంగా దర్శనమిస్తాడు. అత్యున్నత శిఖరాలకు చేరి, ఆ తర్వాత అదఃపాతాలం లోకి జారిపోతాడు. శ్రీమంతుడిగా సుఖభోగాలు అనుభవించి మరుసటిరోజునాటికి సర్వం కోల్పోయి కుచేలుడిగా మిగిలిపోతాడు. ఈ ఎగుడుదిగుడుల తరంగమే జెఫ్రీ ఆర్చర్.
29 ఏళ్లకే బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు. 34 ఏళ్లకు పెట్టుబడులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి. ఏ పనిలేక ఖాళీగా కూర్చొని ఏమీ పాలుపోక.. తన జీవిత అనుభవాలనే అక్షరబద్ధం చేస్తే. ఎలా ఉంటుంది అనుకున్నాడు. అంతే, జీవిత సంక్షోభం నుంచి బయటపడేందుకు కలం పట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను సంపాదించాడు. గొప్ప నవలా రచయితగా ఖ్యాతిగాంచాడు. రాజకీయాల్లో మళ్లీ ఎదిగి.. కోర్టులో అబద్ధపు సాక్ష్యం ఇచ్చిన కేసులో జైలుకెళ్లాడు. జెఫ్రీ ఆర్చర్ జీవితం నవలల్లో కనిపించే మలుపులను తలపిస్తుంది.
కేన్ అండ్ ఏబెల్ నవలతో ప్రపంచ పాఠకులను ఆకట్టుకున్న ఈ బ్రిటిష్ రచయిత 2026 అక్టోబర్ 5న, 86 ఏళ్ల వయసులో తన నివాసంలో కన్నుమూశారు. ఆయన చివరి నవల ‘ఆడమ్ అండ్ ఈవ్’ (Adam & Eve) తన రచనలన్నింటిలోకి విశిష్టమైనదిగా నిలువబోతుందని ప్రకటించారు. ఆ పుస్తక ఆవిష్కరణకు ఒక రోజుముందే కన్ను మూయటం విషాదం.
* 64 ఏళ్ళ తండ్రికి కొడుకు..
జెఫ్రీ హోవర్డ్ ఆర్చర్ 1940 ఏప్రిల్ 15న లండన్‌లో జన్మించాడు. తండ్రి విలియం ఆర్చర్, తల్లి లోలా ఆర్చర్. ఆమె వివాహానికి ముందు ఇంటిపేరు కుక్. చిన్నతనంలోనే కుటుంబం సోమర్సెట్లోని సముద్రతీర పట్టణం వెస్టన్ సూపర్ మేర్కు వెళ్లింది. ఆర్చర్ బాల్యం ప్రధానంగా అక్కడే గడిచింది.
జెఫ్రీ పుట్టినప్పుడు తండ్రి వయసు సుమారు 64 ఏళ్లు. ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఆర్చర్ చెప్పిన వివరాల్లో కొన్ని తరువాత వివాదాస్పదమయ్యాయి. తండ్రిని మొదటి ప్రపంచయుద్ధంలో సేవలందించిన వీరుడిగా ఆర్చర్ వర్ణించినప్పటికీ, ఆ వాదనకు ఆధారాలు లభించలేదు. విలియం జీవితంలో మోసాలు, ద్వివివాహానికి సంబంధించిన చరిత్ర ఉన్నట్లు జీవితచరిత్ర పరిశోధనలు వెల్లడించాయి. తల్లి లోలా స్థానిక ‘వెస్టన్ మెర్క్యురీ’ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆర్థికంగా పెద్దగా స్థోమత లేని కుటుంబంలో పెరిగిన ఆర్చర్‌కు తల్లి ప్రధాన అండగా నిలిచారు. ఆమె పత్రికా రచనల్లో కుమారుడి బాల్య సంఘటనలకు కూడా చోటు లభించేది. అక్షరాలతో జీవనం సాగించిన తల్లి కుమారుడు.. తరువాత కథలతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించడం ఆయన జీవితంలోని ఆసక్తికరమైన అంశం.
* బాల్యంలో వేధింపులు ..
1951లో స్కాలర్‌షిప్‌తో సోమర్సెట్లోని వెల్లింగ్టన్ స్కూల్లో చేరాడు ఆర్చర్. పాఠశాల రోజుల్లో తోటి విద్యార్థుల వేధింపులను ఎదుర్కొన్నాడు. తరువాత శారీరక దృఢత్వం, పరుగుపందేలపై దృష్టిపెట్టాడు. చదువు అనంతరం కొంతకాలం వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1963లో విద్యా డిప్లొమా కోర్సు కోసం ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి బ్రేస్నోస్ కాలేజీతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. అక్కడ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపి విశ్వవిద్యాలయ క్రీడా గౌరవమైన ‘బ్లూ’ పొందాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ అథ్లెటిక్స్ క్లబ్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు.
* సంక్షోభాల్లోనూ సాఫీగా సంసార జీవితం
ఆక్స్‌ఫర్డ్‌లో పరిచయమైన మేరీ వీడెన్ను 1966లో ఆర్చర్ వివాహం చేసుకున్నారు. రసాయన శాస్త్రవేత్త అయిన మేరీ సౌరశక్తి పరిశోధనలో పనిచేశారు. తరువాత వైద్య, విజ్ఞాన సంస్థల నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టారు.
వీరికి విలియం, జేమ్స్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఐదుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఆర్థిక కష్టాలు, రాజకీయ వివాదాలు, జైలుశిక్ష వంటి సంక్షోభాల మధ్య కూడా వారి వివాహ బంధం కొనసాగింది. ఆర్చర్ మరణించే సమయానికి వారి దాంపత్య జీవితం 60 ఏళ్లు పూర్తిచేసుకుంది.
* చేదు అనుభవమే స్టోరీ లైన్
కన్జర్వేటివ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆర్చర్ 1969లో లౌత్ నియోజకవర్గం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు 29 ఏళ్లు మాత్రమే ఉంటాయి. అయితే కెనడాకు చెందిన ఆక్వాబ్లాస్ట్ కంపెనీలో పెట్టుబడి ఆయన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. భారీగా నష్టపోయి అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 1974 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయలేదు. రాజకీయాల్లో ఎదగాలనుకున్న వ్యక్తికి జీవనోపాధి కోసం కొత్త మార్గం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆర్చర్ రాసిన తొలి నవల ‘నాట్ ఎ పెన్నీ మోర్, నాట్ ఎ పెన్నీ లెస్’ 1976లో వెలువడింది. ఒక పెట్టుబడి మోసంలో డబ్బు కోల్పోయిన నలుగురు వ్యక్తులు.. తమను మోసం చేసిన వ్యక్తి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు వేసే పథకాలే కథకు కేంద్రం. తాను ఎదుర్కొన్న ఆర్థిక దెబ్బను కథకు నేపథ్యంగా మార్చుకున్నారు. పాఠకుడిని ఆసక్తిగా ముందుకు నడిపించే రచనా విధానం ఈ తొలి నవలలోనే కనిపించింది. తరువాత వచ్చిన షల్ వీ టెల్ ది ప్రెసిడెంట్?ఆయనకు థ్రిల్లర్ రచయితగా మరింత గుర్తింపు తెచ్చింది. 1979లో ప్రచురితమైన ‘కేన్ అండ్ ఏబెల్’ ఆర్చర్ రచనా జీవితాన్ని మలుపుతిప్పింది. ఒకే రోజున జన్మించిన భిన్నమైన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. సంపన్న అమెరికన్ బ్యాంకింగ్ కుటుంబంలో పుట్టిన విలియం కేన్ ఒకవైపు, ఎన్నో కష్టాలను దాటి అమెరికాలో హోటళ్ల సామ్రాజ్యం నిర్మించిన పోలిష్ వలసదారు ఏబెల్ రోస్నోవ్స్కీ మరోవైపు. వారి ఆశయాలు, వ్యాపార ప్రయాణం, పరస్పర శత్రుత్వం కథను నడిపిస్తాయి.ఈ నవల భారతదేశంలోనూ విశేష ఆదరణ పొందింది. కుటుంబ సంబంధాలు, ఎదగాలనే పట్టుదల, డబ్బు, ప్రతీకారం వంటి అంశాలను ఉత్కంఠతో మేళవించడం ఆర్చర్‌కు విస్తృత పాఠక వర్గాన్ని తెచ్చిపెట్టింది.
* తప్పుడు సాక్ష్యానికి జైలు శిక్ష
రచయితగా విజయం సాధించిన తరువాత ఆర్చర్ రాజకీయాల్లో మళ్లీ ఎదిగారు. 1985లో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మరుసటి ఏడాది ఒక మహిళకు డబ్బు చెల్లించిన వ్యవహారంపై పత్రికా కథనం రావడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ వార్తకు సంబంధించి ‘డైలీ స్టార్’పై వేసిన పరువునష్టం కేసులో 1987లో విజయం సాధించారు. 1992లో జీవితకాల పీర్ హోదా పొందిన ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి ప్రవేశించారు. తరువాత లండన్ మేయర్ పదవికి కన్జర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అయితే పాత పరువునష్టం కేసులో తప్పుడు సాక్ష్యాలకు సంబంధించిన విషయాలు బయటపడటంతో 1999లో అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు.
అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం, న్యాయప్రక్రియను తప్పుదోవ పట్టించడం నేరాలపై ఆయనకు 2001లో నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. సుమారు రెండేళ్లు జైలులో గడిపి 2003లో విడుదలయ్యారు. ఈ ఘటన ఆయన క్రియాశీల రాజకీయ జీవితానికి ముగింపు పలికింది.
* జైలు అనుభవాలూ పుస్తకాలే..
జైలులో ఉన్నప్పటికీ ఆర్చర్ రచన కొనసాగించారు. తన అనుభవాలను ‘ఎ ప్రిజన్ డైరీ’ పేరుతో మూడు భాగాలుగా వెలువరిం చారు.హెల్, పర్గటరీ, హెవెన్ అనే ఈ భాగాల్లో వేర్వేరు జైళ్లలోని జీవితం, ఖైదీల పరిస్థితులు, రోజువారీ అనుభవాలను వివరించారు. తరువాత వచ్చిన క్యాట్ ఓ నైన్ టేల్స్ కథాసంపుటిలోనూ జైలులో విన్న సంఘటనల ప్రభావం కనిపిస్తుంది.
ఆర్చర్ ప్రధాన నవలలు :
* నాట్ ఎ పెన్నీ మోర్, నాట్ ఎ పెన్నీ లెస్ (Not a Penny More, Not a Penny Less) 1976
* షాల్ వీ టెల్ ది ప్రెసిడెంట్? (Shall We Tell the President?) 1977
* కేన్ అండ్ ఏబెల్ (Kane and Abel) 1979
* ది ప్రాడిగల్ డాటర్ (The Prodigal Daughter) 1982
* ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ (First Among Equals) 1984
* ఎ మ్యాటర్ ఆఫ్ ఆనర్ (A Matter of Honour) 1986
* యాజ్ ది క్రో ఫ్లైస్ (As the Crow Flies) 1991
* ఆనర్ అమాంగ్ థీవ్స్ (Honour Among Thieves) 1993
* ది ఫోర్త్ ఎస్టేట్ (The Fourth Estate) 1996
* ది ఎలెవెంత్ కమాండ్మెంట్ (The Eleventh Commandment) 1998
* సన్స్ ఆఫ్ ఫార్చ్యూన్ (Sons of Fortune) 2003
* ఫాల్స్ ఇంప్రెషన్ (False Impression) 2006
* ఎ ప్రిజనర్ ఆఫ్ బర్త్ (A Prisoner of Birth) 2008
* పాత్స్ ఆఫ్ గ్లోరీ (Paths of Glory) 2009
* హెడ్స్ యూ విన్ (Heads You Win) 2018
* ఆడమ్ అండ్ ఈవ్ (Adam & Eve) 2026
——————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.

