Hyderabad
* కైట్ షాప్ నిర్వాహకుడు అరెస్ట్
Hyderabad| ఆకేరు న్యూస్, హైదరాబాద్:* హైదరాబాద్‌లో నిషేధిత చైనా మాంజా అక్రమ విక్రయాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని భారీగా నిల్వ చేసిన చైనా సింథటిక్ నైలాన్, గ్లాస్ కోటెడ్ మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలాపత్తర్లోని భట్కో ట్రాన్స్పోర్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 10 కార్టన్లలో ఉన్న 480 బాబిన్ల మాంజా పట్టుబడింది. వీటి విలువ సుమారు రూ.7.5 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
7.5 లక్షల విలువైన మాంజా స్వాధీనం
పోలీసుల వివరాల ప్రకారం.. నిషేధిత మాంజా హైదరాబాద్‌కు చేరినట్లు సమాచారం అందడంతో చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్, కలాపత్తర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అక్టోబర్ 6న కలాపత్తర్లోని భట్కో ట్రాన్స్పోర్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న కార్టన్లు పోలీసుల కంటపడ్డాయి. వాటిని పరిశీలించగా 10 కార్టన్లలో భారీ మొత్తంలో నిషేధిత చైనా సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 480 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాంజా విలువ సుమారు రూ.7.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిర్వాహకుడి అరెస్ట్
ఈ వ్యవహారానికి సంబంధించి మంగళ్‌హాట్‌లో కైట్ షాప్ నిర్వహిస్తున్న 26 ఏళ్ల అభిషేక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంక్రాంతి పండుగ సమయంలో గాలిపటాలు ఎగరేసే వారి నుంచి నిషేధిత మాంజాకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే భారీ మొత్తంలో మాంజాను తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
జైపూర్ నుంచి హైదరాబాద్‌కు
పోలీసుల దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన నిషేధిత మాంజాను జైపూర్ నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.హైదరాబాద్‌కు చేరిన తర్వాత భట్కో ట్రాన్స్పోర్ట్ వద్ద సరుకును తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మాంజా సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, దానిని జైపూర్ నుంచి పంపించిన నెట్‌వర్క్‌పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత మాంజాతో పాటు నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత మాంజాపై పోలీసుల నిఘా
చైనా మాంజా, సింథటిక్ నైలాన్ మాంజా కారణంగా మనుషులు, పక్షులు, ఇతర జంతువులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వీటి వినియోగం, విక్రయంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు అక్రమంగా వీటిని నిల్వ చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

