Dowry Harassment
రూ. 40 లక్షల ప్లాట్, బంగారం స్వాహా
రూ. 5 కోట్ల ఇల్లు కొంటానని నమ్మించి బాధితురాలిని ముంచేసాడు
ఆకేరు న్యూస్, వరంగల్ : లండన్‌లో స్థిరపడ్డానని, అక్కడ ఐదు కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేస్తానని నమ్మించి, భార్య పుట్టింటి నుంచి వచ్చిన కోట్లాది రూపాయల ఆస్తిని విక్రయించి, వేధింపులకు గురిచేస్తున్న ఒక కేటుగాడి ఉదంతం వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.
లండన్ ఉద్యోగి అని నమ్మి రూ. లక్షల కట్నం
నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన కొండ్లే రజిత-సతీష్ కుమార్ దంపతుల కుమార్తె దివ్యకు, వరంగల్ శివనగర్‌కు చెందిన మచ్చ రాజమణి-శ్రీహరిల కుమారుడు పవన్ కుమార్‌తో 2022 ఆగస్టు 17న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పవన్ కుమార్ లండన్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని నమ్మడంతో, దివ్య తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి 191 గజాల ఇంటి ప్లాట్, 8 తులాల బంగారం, రూ. 5 లక్షల నగదును కట్నకానుకలుగా సమర్పించారు.
లండన్ ఆశ చూపి ప్లాట్ విక్రయం
వివాహమైన తర్వాత ఆరు నెలల పాటు వీరి సంసారం సుఖంగానే సాగింది. అనంతరం పవన్ కుమార్ ఉద్యోగ రీత్యా లండన్ వెళ్తూ, త్వరలోనే నిన్ను కూడా తీసుకెళ్తానని భార్యకు మాట ఇచ్చాడు. అన్నట్లే 10 నెలల తర్వాత దివ్యను లండన్ తీసుకెళ్లాడు. అయితే అక్కడ కేవలం నెల రోజులు మాత్రమే ఉంచి, తిరిగి ఇద్దరూ వరంగల్ వచ్చారు.
లండన్ లో రూ. 5 కోట్ల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేయాల్సి ఉందని, దానికి అడ్వాన్స్ కింద డబ్బులు కావాలని భార్యను, ఆమె తల్లిదండ్రులను పవన్ నమ్మబలికాడు. పెళ్లిలో కట్నంగా ఇచ్చిన 191 గజాల ప్లాట్‌ను అమ్మితే ఆ డబ్బుతో లండన్‌లో ఇల్లు కొందామని నమ్మించడంతో, బాధితురాలి కుటుంబం 2023 డిసెంబర్ నెలలో ఆ ప్లాట్‌ను రూ. 40 లక్షలకు విక్రయించి ఆ సొమ్మును పవన్ కుమార్‌కు అందజేసింది.
ఆడపడుచు ప్రోద్బలంతో వేధింపులు
డబ్బులు చేతికి వచ్చిన తర్వాత లండన్ వెళ్లకుండా పవన్ కుమార్ వరంగల్‌లోనే రెండేళ్ల పాటు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పవన్ కుమార్ అక్క మార్థ ప్రశాంతి, ఆమె భర్త నాగరాజుల ప్రోద్బలంతో దివ్యపై అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.
దివ్య వద్ద ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, మిగిలిన నగదును లాక్కుని, ఆమెపై శారీరకంగా, మానసికంగా దాడికి పాల్పడ్డారు. చివరికి ఏప్రిల్ 2025న బాధితురాలు దివ్యను బలవంతంగా ఇంట్లోంచి వెళ్లగొట్టి నర్సంపేటలోని ఆమె పుట్టింటికి పంపించేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు దివ్య, తనకు న్యాయం చేయాలని, తన ఆస్తిని, బంగారాన్ని తిరిగి ఇప్పించి, నిందితులైన భర్త పవన్ కుమార్, ఆడపడుచు మార్థ ప్రశాంతి, నాగరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, సమాజాన్ని వేడుకుంటోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

