Dhruv Rathee Bengaluru Protest
* నినాదాలతో దద్దరిల్లిన ఫ్రీడమ్ పార్క్
* బెంగళూరులో ధ్రువ్ రాఠీ నిరసన ప్రదర్శన
* ఓటర్ల జాబితా అవకతవకలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
ఆకేరు న్యూస్ , డెస్క్ : ఓట్ చోర్ .. గద్దీ చోడ్ అంటూ ప్రముఖ యూట్యూబర్, రాజకీయ విశ్లేషకుడు ధ్రువ్ రాఠీ నినదించారు. ఆయనతో అక్కడికి చేరుకున్న ప్రజలు కూడా గొంతు కలిపారు.. దీంతో ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది. గురువారం బెంగళూరు వేదికగా జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI)పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు , తొలగింపులు జరిగాయన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) , కర్ణాటక పౌర సమాజ సంస్థల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)కు వ్యతిరేకంగా ప్రజా కోర్టు (People’s Tribunal) కార్యక్రమాన్ని నిర్వహించారు.తన జీవితంలో ఇదే మొదటి ప్రత్యక్ష నిరసన ప్రదర్శన అని పేర్కొన్న ధ్రువ్ రాఠీ, తాను ఇక్కడికి ప్రభుత్వం మార్చడానికి రాలేదన్నారు. ఎలాన్ మస్క్, జార్జ్ సోరెస్ నిధులతో నేను ఇండియాకు రాలేదని, కేవలం ఒక సాధారణ పౌరుడిగా స్వంత ఖర్చులతో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వచ్చానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాఠీ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పారదర్శకతను పూర్తిగా కోల్పోయిందని విమర్శిస్తూ ఆయన నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల జాబితా అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించారు.
* తొలగించిన ఓటర్లను ఎన్నికల తర్వాత ఎలా చేర్చారు
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు దాదాపు 70,000 మంది నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు రాగానే ఆ పేర్లను మళ్లీ రహస్యంగా చేర్చారని ధృవ్ రాఠీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం ఓటింగ్ సమయంలోనే వీరు ఓటు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇక బీహార్‌లో ఏకంగా 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని, సుప్రీంకోర్టు ఆదేశించే వరకు ఆ వివరాలను ప్రజలకు తెలపకుండా ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దాచారని విమర్శించారు. దీనికి భిన్నంగా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 14 లక్షల మంది ఓటర్ల పేర్లను అకస్మాత్తుగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటర్ల జాబితాలో చేర్చారని ప్రశ్నించారు. గోవాలో 100 మందికి పైగా ఓటర్ల పేర్లను చేర్చాలని అధికారులు (EROs) భావించినప్పటికీ, ఎన్నికల సంఘం అధికారిక సాఫ్ట్‌వేర్‌లో అందుకు అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
* బీజేపీ ఓటర్లకు విజ్క్షప్తి
ఓట్ చోరీ సమస్య కేవలం ఒక పార్టీకి సంబంధించినది కాదని, ఓటు హక్కు అనేది ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కు అని ధ్రువ్ రాఠీ అన్నారు. మీరు బీజేపీకి ఓటు వేసినా, కాంగ్రెస్‌కు వేసినా.. ఓట్ల దొంగతనం అనేది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని, అందరూ కలిసి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కర్ణాటక పౌర సమాజ సంస్థలు ఊరూరా తిరిగి క్షేత్ర స్థాయిలో విచారించి, చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేసి ఓటర్ల జాబితా నుండి తొలగించిన బాధితులను గుర్తించాయని ధ్రువ్ రాఠీ ప్రశంసించారు. నిరసన ముగింపులో పాల్గొన్న జనమంతా ఎన్నికల సంఘం వైఖరికి వ్యతిరేకంగా ఓట్ చోర్, గద్దీ ఛోడ్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్, సీజేపీ నేత అభిజిత్ దీప్కే తదితరులు పాల్గొని ప్రసంగించారు..
—————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.

