* అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్
* ప్రత్యేకంగా అధికారుల నియామకం
* స్కూళ్లలో తనిఖీలు మొదలు
CURE Hyderabad| ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : రాజధాని హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని విభాగాల్లోనూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)గా మారి నలువైపులా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తోంది. రహదారులు, ఫ్లైఓవర్లు, పార్కుల నిర్మాణమే కాదు.. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను కూడా విభిన్నంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది.
తొలుత 164 పాఠశాలల్లో..
క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 164 పాఠశాలలను తొలి విడతలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దే పనులను మొదలుపెట్టింది. 11 కొత్త సమీకృత పాఠశాలల సముదాయాలను నిర్మించడంతోపాటు ఇప్పటికే ఉన్న 17 ఉన్నత పాఠశాలలను 12వ తరగతికి అప్‌గ్రేడ్ చేయనుంది, నిర్దేశిత పట్టణ ప్రాంతాల్లో 501 కొత్త తరగతి గదులను ఏర్పాటు చేయనుంది.
ప్రత్యేక అధికారులకు బాధ్యతలు
క్యూర్ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాలకూ నలుగురు జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ హోదా కలిగిన సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. దీనికి ఇటీవలే విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైదరాబాద్ జిల్లాకు ఎం.రాధారెడ్డి, రంగారెడ్డికి కె.లింగయ్య, మేడ్చల్‌కు రమణకుమార్, సంగారెడ్డికి జి.రమేష్‌ను నియమించారు. వీరు తమ పనిని కూడా మొదలుపెట్టారు.
పాఠశాలల తనిఖీలు
పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లోని సర్కారు పాఠశాలలను నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వెంటనే వాటిని నోట్ చేసుకుంటున్నారు. విద్యాశాఖ కార్యదర్శికి అందించేందుకు నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలపై ఫోకస్ చేసి విద్యార్థుల చేరికలకు ప్రయత్నించనున్నారు. దీంతోపాటు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బడుల్లో జరుగుతున్న అదనపు తరగతి గదులు, కొత్త భవనాల పనులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయనున్నారు.
చీఫ్ మినిస్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంది?
తనిఖీలతో పాటు మధ్యాహ్న భోజనంతో పాటు చీఫ్ మినిస్టర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం అన్ని పాఠశాలల్లోనూ అమలులో ఉందా? నాణ్యత ఎలా ఉంది? అనే అంశాలపై పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ వంద శాతం పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేయనున్నారు. అంతేకాకుండా దాదాపు 19 అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

