మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
* సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
* తెలంగాణకు 575 TMCలు నీటి హక్కుల కోసం పోరాటం
* పల్నాడు వాటర్ గ్రిడ్ గత ప్రభుత్వమే అనుమతించింది
* జీవో నంబర్ 56 బయటపెట్టిన సీఎం
ఆకేరు న్యూస్, డెస్క్: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను సాధించుకునే విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజకీయంగా, న్యాయపరంగా అన్ని విధాలా పోరాటం చేస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై నెలకొన్న పరిణామాలు, పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై వాస్తవాలను వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
* తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి..
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించిందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతంలో 71 శాతం తెలంగాణలోనే ఉన్నందున రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా దక్కాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ హక్కుల కోసం పోరాటం ప్రారంభించిందన్నారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో పాటు ప్రధానమంత్రి వద్ద కూడా తెలంగాణ హక్కుల కోసం ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. అవసరమైన న్యాయపోరాటాన్ని సుప్రీంకోర్టులోనూ కొనసాగిస్తున్నామని తెలిపారు.
* ఆరు నుంచి ఎనిమిది నెలల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు..
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తీర్పు వెలువడేలా నిరంతరం సమీక్షిస్తూ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జలరంగ నిపుణులు, న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటూ నిర్దిష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.
పల్నాడు వాటర్ గ్రిడ్‌కు గత ప్రభుత్వమే అవకాశం కల్పించింది
పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు తమ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్న ఆరోపణలను సీఎం ఖండించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులకు గత ప్రభుత్వమే మార్గం సుగమం చేసిందని ఆరోపించారు.
2022 ఫిబ్రవరి 16న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 56ను మీడియా ముందు ప్రదర్శించారు. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద 13 జిల్లాలకు తాగునీటి సౌకర్యం కల్పించే పేరుతో గుంటూరు జిల్లా పల్నాడుకు రూ.1,200 కోట్లతో నీటిని తరలించే ప్రతిపాదనకు అవకాశం కల్పించారని వివరించారు.
ఈ పథకానికి జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి రూ.500 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ పొందేలా అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ జీవోపై అప్పటి ప్రభుత్వం ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని సీఎం విమర్శించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.
* 66:34 నిష్పత్తిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీఎం..
2020లో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నిష్పత్తిలో నీటి పంపిణీ కొనసాగించేందుకు అంగీకరించడం రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2015లో అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకు అంగీకరించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఆనాటి నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రాజెక్టులపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని సీఎం పేర్కొన్నారు.
* పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపైనా విమర్శలు..
పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు గత ప్రభుత్వాలు అనుమతించాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొదట 11 వేల క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉండగా, దాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతులు ఇచ్చారని విమర్శించారు.
2005 మార్చి 29న ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు గురించి స్పష్టంగా ప్రస్తావించారని, అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్ రావు దీనిపై అభ్యంతరం చెప్పలేదని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే 2004లో హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1 ద్వారా 40 టీఎంసీల నీటిని తరలించేందుకు జీవో నంబర్ 73 జారీ చేసిన సమయంలోనూ తెలంగాణ హక్కులకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. 2020లో రాయలసీమ లిఫ్ట్‌కు సంబంధించిన పరిణామాలను కూడా ప్రస్తావించారు.
* తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్.. ఏపీలో వేగంగా పనులు..
గత పదేళ్ల పాలనలో తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పోతిరెడ్డిపాడు, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, రాజోలిబండ వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకున్నారని అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది ప్రాజెక్టులు నిర్మించగా, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రోజుకు 4.47 టీఎంసీల నీటిని తరలించుకునే అవకాశం ఉండేదని, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టుల కారణంగా రోజుకు 13.17 టీఎంసీల నీటిని తరలించుకునే పరిస్థితి ఏర్పడిందని సీఎం వివరించారు.
* భూసేకరణ చేయకపోవడం వల్లే ప్రాజెక్టులకు ఆటంకాలు..
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ముందుగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని విమర్శించారు. భూములు సేకరించకుండా, నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. గత పదేళ్లలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా శ్రీశైలంలో 797 ఎఫ్ఆర్ఎల్ స్థాయి వద్ద నీటిని తరలించుకునేందుకు అవకాశం కల్పించారని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
* నీటి హక్కులపై తప్పుడు ప్రచారం చేయొద్దు..
కృష్ణా జలాల విషయంలో ప్రజల్లో అనవసరమైన అపోహలు, అనుమానాలు సృష్టించవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నీటిని ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారంటూ ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎవరైనా ఈ అంశంపై వక్రీకరించి మాట్లాడితే వాస్తవాలను, ఆధారాలను పరిశీలించాలని ప్రజలకు సూచించారు.
గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు త్వరగా వచ్చేలా ఒత్తిడి తెస్తామని, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.
Read Also : పెట్టుబడుల పండుగకు తెలంగాణ రెడీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

