* చాకచక్యంగా కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Crime| ఆకేరు న్యూస్, సైబర్ క్రైమ్: కంపెనీ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి ఓ పారిశ్రామిక సంస్థ నుంచి రూ. 35.52 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడ ప్రాంతంలోని స్పాంటెక్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రముఖ పారిశ్రామిక సంస్థ కు చెందిన ఈమెయిల్ ఐడీనే హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, చాకచక్యంగా వ్యవహరిస్తూ కంపెనీ బ్యాంకు ఖాతా వివరాలను మార్చేలా చేసి భారీ మొత్తంలో నగదును కాజేశారు. సంస్థకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌గా వ్యవహరిస్తున్న శశి భార్గవ పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు చేశారు.
వ్యాపార సంభాషణలు సేమ్ ఉండడంతో..
అక్టోబరు 3వ తేదీ మధ్యాహ్నం 12:14 గంటలకు స్పాంటెక్ కంపెనీ అధికారిక ఇమెయిల్ ఐడీకి నాట్కామ్ కంపెనీ పేరిట ఓ ఇమెయిల్ వచ్చింది. అందులో తమ పాత బ్యాంకు ఖాతా సాంకేతిక లేదా పరిపాలనా కారణాల వల్ల మారింది అని, ఇకపై భవిష్యత్తులో జరిగే అన్ని రకాల చెల్లింపులు, బకాయిలను కొత్తగా కేటాయించిన బ్యాంకు ఖాతాకే జమ చేయాలని కోరారు. గతంలోనే సరఫరాదారు నుంచి వచ్చిన అధికారిక సమాచార మార్పిడి శైలిలోనే ఈ ఇమెయిల్ ఉండటం, పైగా నాట్కామ్ ఒరిజినల్ ఐడీ నుంచే మెయిల్ రావడం, ఆ మెయిల్లో గతంలో ఇరు సంస్థల మధ్య జరిగిన పాత వ్యాపార సంభాషణలు కూడా యథాతథంగా ఉండటంతో స్పాంటెక్ ఉద్యోగులు ఏమాత్రం సందేహించలేదు. దీంతో వెంటనే కంపెనీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అయి లబ్ధిదారుడి ఖాతా వివరాలను నకిలీ వివరాలతో అప్డేట్ చేశారు.
రెండు విడతల్లో రూ. 35,52,962 బదిలీ
ఖాతా వివరాలు మారాయన్న ధీమాతో స్పాంటెక్ ప్రతినిధులు అక్టోబరు 5న కొత్తగా నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు రెండు విడతల్లో మొత్తం రూ. 35,52,962 బదిలీ చేశారు. ఆ తర్వాత అక్టోబరు 6న తాము చెల్లింపులు పూర్తి చేసినట్లు సరఫరాదారు ప్రతినిధికి వాట్సాప్ ద్వారా రశీదులతో సహా సమాచారం అందించారు. అయితే అక్టోబరు 7న నాట్కామ్ సంస్థ ప్రతినిధులు స్పాంటెక్ ప్రతినిధులను సంప్రదించి, తమ ఖాతాలో ఎలాంటి నగదు జమ కాలేదని స్పష్టం చేయడంతో కలకలం రేగింది. అంతేకాకుండా తమ బ్యాంకు ఖాతాను మార్చమని తాము ఎలాంటి ఇమెయిల్ పంపలేదని తెగేసి చెప్పడంతో, తాము సైబర్ మోసానికి గురయ్యామని స్పాంటెక్ నిర్వాహకులు గుర్తించారు. దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

