* అమ్మాయి మనసులోని సంఘర్షణే కథ
* అనుపమ నటన ప్రత్యేక ఆకర్షణ
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ కల్యాణం అని చిత్ర దర్శకుడు బద్రప్ప గాజుల తెలిపారు. నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అమ్మాయి మనసులోని సంఘర్షణే కథ
చదువుకోవాలని, జీవితంలో ఏదో సాధించాలని కలలు కనే అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, సమాజంలో పరువు, సంప్రదాయాల పేరుతో వారి ఆశయాలను పక్కన పెట్టడం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని దర్శకుడు వెల్లడించారు. విద్యార్థి దశలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన అమ్మాయి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? ఆమె కలలు, ఆశయాలు ఏమిటి? అనే ప్రశ్నల నుంచి ఈ కథ పుట్టిందని చెప్పారు.
అమ్మాయిల అభిప్రాయాలను తెలుసుకోకుండా వారి జీవితాలపై నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే విషయాన్ని వినోదాత్మకంగా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశామన్నారు. సినిమాలో ఎక్కువ భాగం వినోదం ఉన్నప్పటికీ, అవసరమైన చోట హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఉంటాయని వివరించారు.
అనుపమ నటన ప్రత్యేక ఆకర్షణ
కథను మొదట అనుపమ పరమేశ్వరన్‌కు చెప్పాలని అనుకున్నానని, అయితే ఆమె అంగీకరిస్తారా లేదా అనే సందేహం ఉండేదని బద్రప్ప తెలిపారు. కథ విన్న వెంటనే ఆమె సినిమా చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. తన పాత్రలోని భావోద్వేగాలను అర్థం చేసుకుని, సన్నివేశాలకు అనుగుణంగా పలు మార్పులు సూచిస్తూ ఆమె నటించారని పేర్కొన్నారు. అనుపమ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కథ విన్న తర్వాత తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని దర్శకుడు చెప్పారు. నవరసాలను అద్భుతంగా పలికిస్తూ మంచి నటన కనబరిచారని ప్రశంసించారు.
తెలంగాణ నేపథ్యంతో..
తాను మేడ్చల్ సమీపంలోని బండమైలారంలో పుట్టి పెరిగానని బద్రప్ప తెలిపారు. తన కుటుంబంలోనే కళలకు సంబంధించిన నేపథ్యం ఉందని చెప్పారు. తాత, తండ్రి గ్రామాల్లో జరిగే భాగోతాల్లో నటించేవారని, వారి అనుభవాలు తనలో కళల పట్ల ఆసక్తిని పెంచాయని వివరించారు.
బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివిన తాను ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డాక్యుమెంటరీలు, టూరిజం చిత్రాలు రూపొందించానని, 200కు పైగా వీడియోలు చేశానని వెల్లడించారు. ఆ ప్రయాణంలో అనేక గ్రామాలకు వెళ్లి ప్రజల జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం లభించిందన్నారు. ఇరాన్ చిత్రం ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’ తనను దర్శకుడిగా ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. మన చుట్టూ జరిగే సంఘటనలు, మనుషుల జీవితాలు, వారి అనుభవాలే గొప్ప కథలకు ఆధారమవుతాయని ఆ సినిమా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.
ఇంటి ముందే పెళ్లి సందడి
ప్రస్తుతం ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు నిర్వహించే పరిస్థితి పెరిగిపోయిందని, అయితే ఇంటి ముందు జరిగే పెళ్లిలో ఉండే సందడి, అనుబంధాలు, భావోద్వేగాలు ప్రత్యేకంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఆ వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు సినిమాలో పెళ్లి సన్నివేశాలను ఇంటి ముందే చిత్రీకరించామని వెల్లడించారు. సినిమా టైటిల్లోని ‘క్రేజీ’ అనే పదం క్యాచీగా అనిపించడంతో ‘క్రేజీ కల్యాణం’గా పేరు పెట్టినట్లు చెప్పారు.
మూడు పాటలు రాసిన గోరటి వెంకన్న
ఈ చిత్రానికి డాక్టర్ గోరటి వెంకన్న మూడు పాటలు రాశారని బద్రప్ప తెలిపారు. ఆయన జీవితాన్ని చూసే విధానం, ఆలోచనా ధోరణి పాటల్లో ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి సంస్థ కోసం గతంలో కొన్ని ప్రకటనలు రూపొందించానని, తన పనితనం, నిజాయితీపై నమ్మకంతో ఆయన ఈ సినిమా చేసే అవకాశం కల్పించారని చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

