* దసరా అంటే విజయవాడ గుర్తొచ్చేలా ఏర్పాట్లు
* రాష్ట్రపతి సహా ప్రముఖుల రాక..
* బ్రోచర్ విడుదల చేసిన కేశినేని జానకి లక్ష్మి
Vijayawada| ఆకేరు న్యూస్, విజయవాడ : విజయవాడ ఉత్సవ్-2.0ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవ వేడుకలకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు.
రాష్ట్రపతి సహా ప్రముఖుల రాక..
ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా సముచిత రీతిలో చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే ఎంపీ కేశినేని చిన్ని ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా దసరా పండుగ అనగానే విజయవాడ ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేలా ఈ వేడుకలను తీర్చిదిద్దుతున్నామన్నారు. అంతేకాకుండా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హానుండటం విజయవాడ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
100కు పైగా పోటీలు
నగరంలోని విద్యార్థులు, యువత, మహిళలు మరియు కళాకారుల్లో దాగివున్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేలా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 100కు పైగా పోటీలు, 7 విభిన్న విభాగాల్లో టైటిల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ మన ఇంట్లో జరిగే పండుగలా భావించి హాజరు కావాలని కోరారు. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాని ప్రజలందరి సొంత పండుగ అని అభివర్ణించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు పగటిపూట ఆధ్యాత్మిక అనుభూతిని, సాయంత్రం వేళల్లో కన్నులపండువైన సాంస్కృతిక ప్రదర్శనలను అందించడమే ఉత్సవ్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

