Mulugu Police
* అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆకేరు న్యూస్, ములుగు: దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ములుగు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నివాళులర్పించింది. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీరుల సేవలను స్మరించుకున్నారు.
పోలీస్ విధి పవిత్రమైన కర్తవ్యం
ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ మాట్లాడుతూ.. పోలీస్ విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధతతో కూడిన పవిత్రమైన కర్తవ్యమని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ నక్సలిజం, ఉగ్రవాదం నియంత్రణలో పోలీసులు చేసిన కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కొనియాడారు. తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహాలు, విధానాలు ఇతర రాష్ట్రాల పోలీసులకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. మార్చి 31 నాటికి నక్సలిజం నిర్మూలన లక్ష్య సాధనలో తెలంగాణ పోలీసుల కృషి ప్రశంసనీయమని అన్నారు.
యువతకు అండగా పోలీస్ శాఖ
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ యువతను సరైన మార్గంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామని వివరించారు. యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అమరుల కుటుంబాలకు భరోసా
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పోలీస్ అమరవీరుడి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తనను సంప్రదించవచ్చని తెలిపారు.
అనంతరం ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేసి గౌరవించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరు
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు దయాకర్, సురేష్, సూర్యప్రకాష్, రమేష్, ఆర్ఐలు స్వామి, వెంకటనారాయణ, శ్రీకాంత్, తిరుపతి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

