Minister Seethakka
* రామప్ప చెరువులో 29 అడుగుల నీటి నిల్వ
* పంపింగ్ ద్వారా సరఫరాకు ప్రణాళిక
* ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి: మంత్రి సీతక్క
Minister Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగి, వర్షాలు తగ్గే అవకాశాల నేపథ్యంలో రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
రామప్పలో 29 అడుగుల నీటి నిల్వ
ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని రామప్ప చెరువు, డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీటి నిల్వ ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు సరఫరా మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేలా సంబంధిత అధికారులను కోరినట్లు వెల్లడించారు.
రామప్ప నుంచి నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు వద్దు
అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను పూర్తిగా నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి సీతక్క అన్నారు. ఇలాంటి పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులు ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
ఉపాధి హామీతో నీటి సంరక్షణ
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీతక్క చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ పనుల్లో కూలీల భాగస్వామ్యాన్ని పెంచి, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, గ్రామస్థులకు పిలుపునిచ్చారు.
తాగునీటికి తొలి ప్రాధాన్యం
సాగునీటి అవసరాలతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. నీటి సంరక్షణలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

