Kondam Brothers
* మద్యంపై కఠిన నిర్ణయం
* యువత భవిష్యత్తుపై ఆందోళన
* గ్రామసభలో కీలక తీర్మానం
Kishtapuram| ఆకేరు న్యూస్, రాయపర్తి: గ్రామ సర్వతోముఖాభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, యువత భవిష్యత్తు లక్ష్యంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామం ముందడుగు వేస్తోంది. గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించి కఠిన తీర్మానం చేయాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు సన్నద్ధమవుతున్నారు. యువత మద్యానికి బానిస కాకుండా కాపాడుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న కొండం కృపాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కళాకారులకు ప్రోత్సాహం
గ్రామంలోని సంప్రదాయ కళలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడంలో కొండం బ్రదర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా సంఘాలకు కోలాట దుస్తులు, యువతకు చిరుతల కళారూపాలకు అవసరమైన వస్త్రాలు, డప్పు కళాబృందాలకు డప్పులు, గజ్జెలు, ఇతర దుస్తులను అందజేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. గ్రామంలో కళలు, సంప్రదాయాలు కనుమరుగుకాకుండా వాటిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో సహకారం అందిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి భూదానం
గ్రామ ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ కొండం బ్రదర్స్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కుటుంబంలో జరిగే శుభకార్యాలకు గ్రామస్తులను ఆహ్వానించడంతో పాటు, ఇతర ప్రాంతాల్లో వేడుకలు జరిగినప్పుడు గ్రామ ప్రజల రాకపోకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ ఖర్చులను భరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే సహకార సంఘ భవనం, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణాల కోసం తమ సొంత భూమిని ఉచితంగా అందజేసి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు.
విజయదశమి తర్వాత ప్రత్యేక సమావేశం
ఇటీవల విజయదశమి వేడుకల్లో గ్రామ ప్రజలతో కలిసి పాల్గొన్న కొండం బ్రదర్స్, అనంతరం కొండం రంగారెడ్డి స్వగృహంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి, ఉపసర్పంచ్ తోట సో నర్సయ్య, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, డప్పు కళాబృందాల సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండం కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధే పరమావధిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. గ్రామంలో ఐక్యతను పెంపొందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మద్యంపై కఠిన నిర్ణయానికి సన్నాహాలు
యువత మద్యపానానికి బానిస కావడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కొండం కృపాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మహిళా సంఘాలు, కళాబృందాలు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామంలో మద్యపానంపై నియంత్రణ లేదా నిషేధానికి సంబంధించి త్వరలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా తీర్మానం చేయాలని సమావేశంలో చర్చించారు. ఈ ప్రతిపాదనకు సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
రాబోయే గ్రామసభలో ఈ అంశంపై అధికారిక నిర్ణయం తీసుకుని, అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. గ్రామాభివృద్ధి, మహిళా సాధికారత, సంప్రదాయ కళల పరిరక్షణతో పాటు యువతను మద్యపానానికి దూరంగా ఉంచేందుకు కిష్టాపురం చేస్తున్న ప్రయత్నాలు ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.


