AP Local Body Elections
* చివరి రోజు భారీ స్పందన
* ఫిర్యాదుల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసు భద్రత
* అభ్యర్థులకు రక్షణ కల్పిస్తామని అధికారుల భరోసా
ఆకేరు న్యూస్, అమరావతి :ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ, అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు భద్రతను ఏర్పాటు చేసి అభ్యర్థులు నామినేషన్లు వేసేలా చర్యలు చేపట్టారు.
* కడపలో పోలీసుల భద్రత
కడప కలెక్టరేట్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైసీపీ కార్పొరేటర్లను పోలీసులు వాహనాల్లో తీసుకెళ్లి కార్యాలయంలోకి అనుమతించినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తు మధ్య వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రత కల్పించారు.
* నరసరావుపేటలో కలెక్టర్ పర్యవేక్షణ
నరసరావుపేట ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆమె.. అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తనకు ఫోన్ చేయాలని అభ్యర్థులకు సూచించారు.
* అచ్చంపేటలో ఫిర్యాదుపై వివరణ
అచ్చంపేటలో వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి సురేష్ స్పందించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
* అనంతపురంలో భారీ బందోబస్తు
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఎస్పీ జగదీష్ పరిశీలించారు. జెడ్పీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల అధికారులు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించి నామినేషన్ల స్వీకరణకు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

