Farmers Protest
* సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలి
* వరంగల్లో రైతు సంఘాల నిరసన.. చిత్రపటాల దహనం
Warangal| ఆకేరు న్యూస్, వరంగల్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు మేరకు శుక్రవారం వరంగల్లోని కాశిబుగ్గ సెంటర్లో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ చిత్రపటాలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ఎస్కేఎం జిల్లా కన్వీనర్ కుసుంబా బాబురావు అధ్యక్షత వహించారు. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్, ఏఐయూకేఎస్, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శులు రాచర్ల బాలరాజు, చిర్ర సూరి, చుక్క మొగిలి, కిసాన్ సంఘటన, ఏఐకేఎస్ఎస్ బాధ్యులు సుధామల్ల భాస్కర్, వల్లందాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల తొలగింపుపై ఆందోళన
ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నికల వ్యవస్థను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, తెలంగాణలోనూ దాదాపు 80 లక్షల మంది ఓటర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని వారు ఆరోపించారు.
ఈ పరిణామాలతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు. ఓటు హక్కుకు విఘాతం కలిగించే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
ఉద్యమకారులపై నిర్బంధం వద్దు
ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న ఉద్యమకారులపై నిర్బంధ చర్యలు చేపట్టడం సరికాదని నాయకులు అన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన పాలకులు వారి గొంతుకను అణచివేసే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పట్టించుకోకపోతే విద్యార్థులు, యువకులు, రైతులు, ఇతర ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎస్కేఎం నాయకులు సింగతి సాంబయ్య, జక్కుల తిరుపతి, మైదంపాని, బండి వెంకటేశ్వర్లు, ఐతం నాగేష్తో పాటు పలువురు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

