Collector Chahat Bajpai
* విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలి
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు పాఠశాల భవనానికి పెయింటింగ్ వేయించాలని, అవసరమైన వసతుల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
శుక్రవారం భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.
చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్
ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. బ్లీచింగ్ పౌడర్ నిల్వ చేసే ప్రదేశం, కార్యాలయంలో మరుగుదొడ్ల సదుపాయంపై పంచాయతీ కార్యదర్శి సుజాతను వివరాలు అడిగారు.
గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి, లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేశారా, ఇంకా ఎంతమంది అర్హులకు ఇళ్లు అవసరమనే వివరాలను సర్పంచ్ తిరుమల, పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ప్రతిభను పరిశీలన
ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో నాలుగు, ఐదో తరగతుల విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. గణితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి పరిజ్ఞానాన్ని పరీక్షించారు. ఐదో తరగతి విద్యార్థిని ఆర్ష్యా తబస్సుమ్తోపాటు పలువురు విద్యార్థులు సమాధానాలు చెప్పడంతో వారిని ‘వెరీ గుడ్’ అంటూ అభినందించారు.
విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ పుస్తకాలు అందాయా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్కేల్‌తో కొలతలు ఎలా చేయాలో ప్రశ్నించగా, ఓ విద్యార్థిని తన అరచేతిని స్కేల్‌తో కొలిచి చూపించింది.
అనంతరం ఒకటి, రెండు, మూడు తరగతులు నిర్వహిస్తున్న గదిని పరిశీలించి, చిన్నారులను రైమ్స్ చెప్పాలని కోరారు. విద్యార్థులు వివిధ రైమ్స్ చెప్పడంతో వారితో సరదాగా ముచ్చటించారు. విద్యార్థులకు టై, బెల్టులు అందాయా, మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోందని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
మెరుగైన వసతులు కల్పించాలి
పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయురాలికి సూచించారు. పాఠశాల భవనానికి పెయింటింగ్ వేయించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో స్థానిక సర్పంచ్ తిరుమల, నాయబ్ తహసీల్దార్ సూర్య, మండల వ్యవసాయ అధికారి పద్మ, ఏఈఈ లక్ష్మణ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

