సాదం రమేష్, కన్నెబోయిన బాలరాజులు
* గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి
* జీఎంపీఎస్ డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జనగామ జిల్లా నాయకులు విమర్శించారు. పెంపకందారుల సమస్యలను వెంటనే పరిష్కరించి, రానున్న కరువు పరిస్థితుల నుంచి గొర్రెలు, మేకలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో శనివారం జీఎంపీఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షుడు సాదం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కరువు నివారణకు చర్యలు
ఎల్నినో ప్రభావంతో రానున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో గొర్రెలు, మేకల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. పశువులకు అవసరమైన దాణాను ఉచితంగా పంపిణీ చేయాలని, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో మేతకు ఉపయోగపడే తుమ్మ, రావి, సుబాబుల్ చెట్లను పెంచాలని సూచించారు. ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పశువైద్య సేవలు మెరుగుపర్చాలి
ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పశువైద్యశాలల్లో గొర్రెలు, మేకలకు అవసరమైన వ్యాక్సిన్లు, ఇతర మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి
50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5,000 పింఛన్ అందించాలని జీఎంపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పెంపకందారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, మేకల మల్లేష్, ఎక్కల రాజబీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఆవుల ప్రభాకర్, జిట్టబోయిన రమేష్, బొమ్మరబోయిన శివ, గద్ద రాజు, మోటిక తిరుపతి, జల్లెల రవితో పాటు ఎనిమిది మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

