సీఎం చంద్రబాబు
* వైసీపీపై చంద్రబాబు ఫైర్
* ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అనుసరిస్తాం
* ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులనే ఎన్నుకోవాలి
Chandrababu| ఆకేరు న్యూస్, డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకే వైసీపీ హింసను ప్రోత్సహిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ల సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయనే అభిప్రాయం కల్పించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వైయస్సార్ పార్టీ అధినేత వై యస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తిచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అప్పగించామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాడులు, ఘర్షణలతో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన తదితర అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తి ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రయత్నించారన్నారు.
* కార్యకర్తలపై దాడులు
ఎన్డీఏ కార్యకర్తలపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు ఆయుధాలతో రావడం, అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఘటనలను ప్రస్తావించారు. తంబళ్లపల్లిలో జనసేన కార్యాలయంపై, ఎర్రగుంట్లలో బీజేపీ నాయకులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. దాడి ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని అనుసరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయంపై కూటమి భాగస్వామ్య పక్షాలు తమ వైఖరిని వెల్లడించాయని తెలిపారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు లోబడి వ్యవహరిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను పోలీసులు నిర్వహించాలని చెప్పారు.
* ప్రతి హింస మా విధానం కాదు
హింసకు ప్రతిహింస నా విధానం కాదు. అదే సమయంలో భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తూనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని సూచించారు. దాడులకు దిగితే రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ప్రజలకు భద్రత కల్పిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.గతంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్లినప్పుడు అడ్డుకున్నారన్నారు . ప్రస్తుతం మేము వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. అవసరమైన చోట అభ్యర్థులను పోలీసు వాహనాల్లో తీసుకువెళ్లి నామినేషన్లు వేయిస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందినవారు తప్పు చేసినా సమర్థించబోమని తెలిపారు.
ప్రజలకు సేవ చేసే వ్యక్తులను స్థానిక సంస్థలకు ఎంపిక చేయాలనే ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యల పరిష్కారానికి పనిచేయడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని, మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన అన్నారు.
* ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఫెయిల్
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని చంద్రబాబు సూచించారు. శాసనసభ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వేదిక అని పేర్కొన్నారు. సభలో చర్చకు రాకుండా బయట ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమపై తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించి యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న తీరప్రాంతం, నదీజలాలు, విద్యావంతులైన యువతను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చన్నారు.
రాజకీయ విభేదాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండే తీరును పరిశీలించి ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

