Vijay Deverakonda
* సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
ఆకేరు న్యూస్: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘విరోష్’ టీమ్ తరఫున సైబర్ క్రైమ్ విభాగం డీసీపీకి ఫిర్యాదు అందజేసినట్లు సమాచారం.
మాటలను వక్రీకరించారంటూ..
‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని టీమ్ ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టులు ప్రచారం చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు పేర్కొంది. ఈ ప్రచారం కారణంగా విజయ్, రష్మిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
ఆధారాలు అందజేత
వాక్ స్వాతంత్య్రాన్ని, వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని విరోష్ టీమ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని అంగీకరించబోమని తెలిపింది.
దుష్ప్రచారానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల వివరాలు, స్క్రీన్షాట్లు, ఇతర ఆధారాలను సైబర్ క్రైమ్ అధికారులకు అందజేసినట్లు పేర్కొంది. ఫిర్యాదును పరిశీలించి సమగ్ర విచారణ జరిపిన అనంతరం, తప్పు చేసినట్లు తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

