ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల
* రైతులకు ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల సూచన
Rayaparthi| ఆకేరు న్యూస్, రాయపర్తి: రైతులు సాగు ఖర్చులను తగ్గించుకుంటూ స్థిరమైన ఆదాయం పొందాలంటే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. గ్రామ సర్పంచ్ యాకన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
నేల ఆరోగ్యమే కీలకం
నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని విజయనిర్మల పేర్కొన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. పంట మార్పిడి, మల్చింగ్, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగుతో రైతులు స్థిరమైన నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
తక్కువ నీటితో పంటలు సాగు చేయాలి
మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. పశువులకు అవసరమైన మేత లభ్యతను కూడా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు.
పంట అవశేషాలను కాల్చొద్దు
ఎన్ఎఫ్ఎస్ఎం కన్సల్టెంట్ సారంగం మాట్లాడుతూ పంట అవశేషాలను పొలాల్లో కాల్చకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థాలు పెరిగి, భూసారం మెరుగుపడుతుందని వివరించారు.
హార్టికల్చర్ అధికారి వేణు మాట్లాడుతూ కూరగాయల సాగు ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పామాయిల్, కూరగాయల సాగుకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలి
విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వానాకాలం పంటలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాసంగి సాగులో భూగర్భ జలాల పరిరక్షణకు తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ యాకన్న మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు అందించిన సూచనలను రైతులు పాటించాలని కోరారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను కాపాడాలని, విద్యుత్‌ను బాధ్యతగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు అవగాహన
ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి, ఇరిగేషన్ శాఖ ఏఈ సాయిరాం, రెవెన్యూ ఆర్ఐ చంద్రమౌళి, వ్యవసాయ విస్తరణ అధికారులు కావ్య, క్రాంతి, గ్రామ కార్యదర్శి, మహిళా సంఘాల సీఏ, గ్రామ ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొండూరు గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు హాజరై వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు, ప్రభుత్వ సబ్సిడీలపై అవగాహన పొందారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

