* కమలాహ్యారీస్‌పై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా(America)లో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ (Donald)ప్రెసిడెంట్, డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్(Kamala Harris) హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారిద్దరి ప్రసంగాలు కూడా ఆసక్తిగా మారాయి. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హ్యారీస్ కంటే తానే చూడడానికి బాగుంటానని అన్నారు. ఆమె కంటే తాను మెరుగ్గా ఉంటానని భావిస్తున్నట్టు పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’లో హ్యారీస్‌ను అందాన్ని అభివర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ రాసిన వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై ఉన్నది హీరోయిన్స్ సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ (Elizabeth Taylor ) అని అనుకున్నానని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గత మూడు వారాలుగా హ్యారిస్‌పై ట్రంప్ విమర్శల దాడిని పెంచారు. అయితే వ్యక్తిగత విమర్శలకు సైతం ట్రంప్ వెనుకాడడం లేదు. కమలకు ‘వెర్రి’ అని కూడా ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇక ఈ శుక్రవారం కమలా హ్యారీస్ ప్రకటించిన ఆర్థిక ప్రణాళికపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాలో కమ్యూనిజానికి బీజం వేసే ప్రణాళిక ఇదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
—————————————