Telangana Five day Work Week
* వారానికి 5 రోజుల పనిదినాలు
* సీఎస్ సంజయ్ జాజుకు జేఏసీ సంచలన లేఖ
ఆకేరు న్యూస్, డెస్క్ : రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు ఎల్నినో (El Niño) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి అయిదు (5) రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుకు అధికారికంగా లేఖ రాశారు.
* విద్యుత్, నీటి పొదుపే ప్రధాన లక్ష్యం..
ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల కారణంగా ప్రకృతి వనరుల సంరక్షణ అత్యంత ఆవశ్యకంగా మారిందని జేఏసీ నేతలు లేఖలో పేర్కొన్నారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తీసుకురావడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతివారంలోనూ ఒక రోజు పెద్ద మొత్తంలో నీరు, విద్యుత్, అలాగే ఇంధన వాడకం తగ్గుతుందని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాల విధానం విజయవంతంగా అమలులో ఉన్నందున, రాష్ట్రంలోనూ దీనిని తక్షణమే అమలు చేయాలని కోరారు.
* 37.30 గంటల పని సమయం ప్రతిపాదన
వారంలో 6 రోజుల బదులు 5 రోజులు పని చేయడం ద్వారా ఉద్యోగుల పని గంటలు తగ్గిపోవని జేఏసీ స్పష్టం చేసింది. ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు (రోజుకు 7.30 గంటలు) పనిచేసేలా సమయాన్ని క్రమబద్ధీకరిస్తే వారానికి మొత్తం 37.30 గంటల పని సమయం వస్తుందని వివరించింది. దీనివల్ల ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని, పైగా ప్రభుత్వానికి విద్యుత్, నిర్వహణ ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయని తెలిపింది.
గతంలోనూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO) తో పాటు పలు ఉద్యోగ సంఘాలు పలుమార్లు వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మళ్లీ ఇప్పుడు తీవ్రమవుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో సీఎస్ సంజయ్ జాజు దీనిపై సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

