Palakurthi MLA Mamidala Yashaswini Reddy
* ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపు
ఆకేరు న్యూస్, పాలకుర్తి : ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పట్టభద్రుడి ఓటు , అత్యంత కీలకమని, విద్యావంతులు చైతన్యంతో ముందుకు రావాలని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదుకు 2026 నవంబర్ 6 చివరి గడువు అని తెలిపారు. ఈ మేరకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, పట్టభద్రులకు ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
* నవంబర్ 6లోగా ‘ ఓటరుగా నమోదు చేసుకోవాలి..
అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా ‘ఫారం-18’ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ముఖ్య గమనిక ఏమిటంటే.. గతంలో ఎప్పుడో పట్టభద్రుల ఓటరుగా నమోదైన వారు సైతం ఈసారి తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరూ ఈ చక్కని అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు.
* భవిష్యత్తుకు ప్రతిబింబం పట్టభద్రుల ఓటు..
పట్టభద్రుల ఓటు కేవలం ఒక ఎన్నికల ప్రక్రియకు మాత్రమే పరిమితం కాదని, అది విద్యావంతుల అభిప్రాయాలకు, యువత భవిష్యత్తుకు, నిరుద్యోగుల ఆశలకు, సమాజ సమగ్రాభివృద్ధికి ఒక ప్రతిబింబమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటుకూ ఎంతో విలువ ఉంటుందని తెలిపారు.
* విద్యావంతుల పాత్రే ప్రధానం..
విద్యావంతులైన పట్టభద్రులు చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. విద్య, ఉపాధి అవకాశాలు, యువత సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధి వంటి కీలక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని కోరారు.
పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యావంతులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా నిత్యం అండగా నిలుస్తానని, వారి గొంతుకనై తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భరోసానిచ్చారు. ”మీ ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు.. మీ భవిష్యత్తును నిర్ణయించే అస్త్రం. ప్రతి పట్టభద్రుడు బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి” అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

