Hyderabad ED Raids
* రూ. 24.76 కోట్ల సైబర్ ఫ్రాడ్ గుట్టు రట్టు
* స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం
* అల్లంరాజు సత్యనారాయణమూర్తి నివాసాల్లో ఈడీ సోదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొట్టిన భారీ సైబర్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విరుచుకుపడ్డారు. హైదరాబాద్లోని ప్రధాన నిందితుడైన అల్లంరాజు సత్యనారాయణమూర్తి నివాసాలు, కార్యాలయాలు సహా ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో ఈడీ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు మరియు భారీగా స్థిరాస్తుల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* సైబర్ మోసం జరిగిందిలా..
కేసు వివరాల ప్రకారం.. నిందితులు అమాయక ప్రజలకు ఫోన్ కాల్స్, టెలిగ్రామ్ మరియు సోషల్ మీడియా మెసేజ్ల ద్వారా వల వేశారు. ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే భారీగా లాభాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు. బాధితుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ ఏకంగా రూ. 24.76 కోట్లకు పైగా డిపాజిట్లు చేయించుకుని మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును సీరియస్గా తీసుకున్న ఈడీ.. పిఎంఎల్ఎ (PMLA) చట్టం కింద విచారణ చేపట్టి సోదాలు నిర్వహించింది.
* విల్లాలు, ప్లాట్లు సీజ్.. 11 బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
అల్లంరాజు సత్యనారాయణమూర్తి సైబర్ నేరాల ద్వారా ఆర్జించిన నల్లధనంతో హైదరాబాద్లో పలు స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో తేలింది. సైబర్ మోసం సొమ్ముతో ఒక లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ను కూడా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో రూ. 6.40 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడికి చెందిన 11 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 14 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు. సుమారు రూ. 5 కోట్ల విలువైన ప్లాట్లు, విల్లాలు సహా ఇతర ఆస్తులను ఈడీ అధికారులు గుర్తించి సీజ్ చేసే చర్యలు చేపట్టారు. ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, అక్రమ నిధులను ఏ ఏ ఇతర మార్గాల్లోకి మళ్లించారు అనే కోణంలో ఈడీ అధికారులు పూర్తిస్థాయి విచారణను వేగవంతం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

