CM Revanth Reddy met Union Railway Minister Ashwini Vaishnaw in Delhi
* రైల్వే మంత్రితో సీఎం భేటీ
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల పనులను వేగవంతం చేయడంతో పాటు, కొత్త రైల్వే మార్గాలకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రైల్వే ప్రాజెక్టులపై శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర మంత్రితో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైల్వే అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
* హైస్పీడ్ రైలు కారిడార్లపై చర్చ..
హైదరాబాద్-పుణె, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సీఎం కోరారు. ఈ మూడు కారిడార్లపై కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, కొన్ని మార్పులను సూచిస్తూ తిరిగి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తుది అలైన్‌మెంట్‌ను ఆమోదించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించలేదని తెలిపారు. వీలైనంత త్వరగా అలైన్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి, ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
* వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌కు అనుమతులు..
వికారాబాద్-కృష్ణా మధ్య 130 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాన్ని వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసర ప్రాంతాల్లో భారీగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్టైల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ అభివృద్ధికి కొత్త రైల్వే మార్గం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
* రీజినల్ రింగ్ రైలు అలైన్‌మెంట్‌పై విజ్ఞప్తి..
హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పక్కనే రీజినల్ రింగ్ రైలు మార్గాన్ని కూడా అలైన్మెంట్ చేయాలని సీఎం ప్రతిపాదించారు. రింగ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అనుసంధానం మెరుగుపడటంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వివరించారు.
* కొత్త రైల్వే మార్గాలకు మంజూరు కోరిన సీఎం..
రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పలు కొత్త రైల్వే మార్గాలకు అనుమతులు ఇవ్వాలని రైల్వే మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. వాటిలో ప్రధానంగా..
వికారాబాద్-కృష్ణా (130 కి.మీ.)
డోర్నకల్-గద్వాల్
కల్వకుర్తి-మాచర్ల
కాచిగూడ-జగ్గయ్యపేట (250 కి.మీ.)
పటాన్చెరు-ఆదిలాబాద్ (320 కి.మీ.)
బోధన్-లాతూర్ (175 కి.మీ.)
అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ.)
ఈ మార్గాలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
* అనంతారంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో
మహబూబాబాద్ సమీపంలోని అనంతారం గ్రామంలో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించిన మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 409 ఎకరాల ఒక గుంట భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ డిపో ఏర్పాటుకు అవసరమైన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వే నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
* సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని విస్తరించడం, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన రవాణా మౌలిక సదుపాయాలను కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, సహకారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

