ఢిల్లీ-ఎన్సీఆర్
* 15 రోజుల పాటు నిర్మాణ పనులు బంద్
* నవంబర్ 5 నుంచి కొత్త ఆంక్షలు
* 50 శాతం మందికే కార్యాలయాల్లో విధులు
Delhi Air Pollution| ఆకేరు న్యూస్, డెస్క్: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. శీతాకాలం నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించే ప్రమాదం ఉండటంతో ముందస్తు ఆంక్షలు విధించింది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగులకే ప్రత్యక్షంగా విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. మిగిలిన సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. మరోవైపు దుమ్ము కాలుష్యానికి కారణమయ్యే నిర్మాణ, కూల్చివేత పనులపైనా నిషేధం విధించారు.
50 శాతం మందికే అనుమతి
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) అక్టోబర్ 30న ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు గరిష్ఠంగా 50 శాతం సిబ్బందితోనే పనిచేయాలి. మిగిలిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలి. పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాలకు అవసరమైన మినహాయింపులు ఉంటాయి.
నిర్మాణ పనులకు బ్రేక్
నవంబర్ 5 నుంచి 20 వరకు ఎన్సీఆర్ పరిధిలో దుమ్ము కాలుష్యానికి కారణమయ్యే బహిరంగ నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేయాలని CAQM ఆదేశించింది. భవన నిర్మాణాలతో పాటు రహదారులు, ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, విద్యుత్ ప్రసార లైన్లు, పైప్లైన్లు, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్టుల పనులకూ ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. అయితే మెట్రో, రైల్వేలు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ భద్రత, రక్షణ రంగానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు మినహాయింపులు ఇచ్చారు.
కాలుష్యం పెరగడానికి కారణాలివే!
ప్రతి ఏడాది అక్టోబర్ చివరి నుంచి నవంబర్ మధ్య వరకు ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. పంట వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దీనికి తోడు గాలి వేగం తగ్గడం, వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య కారకాలు ఒకేచోట పేరుకుపోతున్నాయి. గత సంవత్సరాల నవంబర్ నెలలో నమోదైన AQI గణాంకాలను పరిశీలించిన CAQM.. ఈసారి కూడా తీవ్ర కాలుష్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది.
కంపెనీలకు కీలక ఆదేశాలు
కొత్త నిబంధనల నేపథ్యంలో ఐటీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కార్యాలయాలకు వచ్చే వాహనాల సంఖ్య తగ్గించడం ద్వారా కాలుష్య నియంత్రణకు సహకరించవచ్చని భావిస్తున్నారు. నిర్మాణ రంగ సంస్థలు సైతం నిషేధిత పనులను నిర్ణీత గడువులో నిలిపివేయాల్సి ఉంటుంది. నవంబర్ 20 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. అనంతరం వాయు నాణ్యత పరిస్థితులను సమీక్షించి తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

