ASHA Workers Strike | CITU District Secretary Ragula Ramesh
* రూ.18 వేల వేతనం డిమాండ్
* ఆశాల పోరుబాట.. సమ్మె బాట
ఆకేరు న్యూస్, హనుమకొండ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ప్రకటించారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని రాంనగర్ సుందరయ్య భవన్లో యాకూబీ అధ్యక్షతన ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాగుల రమేష్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థకు ఆశా వర్కర్లు కీలక సేవలందిస్తున్నారని తెలిపారు. అయితే, వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గత 20 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయి విధులు, ఆన్లైన్ సర్వేలు, టార్గెట్లు, ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నెలకు కేవలం రూ.9,900 మాత్రమే పారితోషికంగా అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. హామీలను అమలు చేయాలని కోరుతున్న కార్మికులపై నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
* ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు..
– ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.
– పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి.
– ఉద్యోగ భద్రత కల్పించాలి.
* సమ్మెకు ముందు భవిష్యత్ కార్యాచరణ..
– నవంబర్ 3న ఆశా డే సందర్భంగా పీహెచ్సీ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలి.
– నవంబర్ 10న రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించాలి.
– నవంబర్ 15లోగా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలి.
– నవంబర్ 16న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి అధికారులకు సమ్మె నోటీసులు ఇవ్వాలి.
– నవంబర్ 20న మంత్రులకు వినతిపత్రాలు అందజేయాలి.
– డిసెంబర్ 5 నుంచి 10 వరకు గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వినతిపత్రాలు ఇవ్వాలి.
– మండల స్థాయిలో ఎంఆర్ఓలకు సమ్మె నోటీసులు అందజేయాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాగుల రమేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశా యూనియన్ నాయకులు కే. సంధ్య, డి. నవమణి, జి. పుతిలి, కే. పూర్ణిమ, బి. లీల, సునంద, ఎస్. సుభాషిణి, జి. శ్రీలత, ఎం. శైలజ, జె. శ్వేత, బి. శోభ, సీహెచ్. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

