Murasu Cyclone Updates
* ఏపీకి భారీ వర్ష సూచన.. 120 కి.మీ. వేగంతో గాలులు
* ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న మురసు..
* దక్షిణ కోస్తా, రాయలసీమకు అతి భారీ వర్ష హెచ్చరిక
ఆకేరు న్యూస్, డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను (Murasu Cyclone) ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. నవంబర్ 2వ తేదీ ఉదయం 5:30 గంటల ఆర్టీజీఎస్–ఏపీఎస్డీఎంఏ బులెటిన్ ప్రకారం.. తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. నెల్లూరు–నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో అర్ధరాత్రి లేదా నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో నవంబర్ 2, 3 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
* ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
నవంబర్ 2న కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని అధికారులు హెచ్చరించారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని అంచనా. అలాగే నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
* సహాయక చర్యలకు 13 బృందాలు సిద్ధం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు.
* పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
మురసు తుపాను ప్రభావం, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో నవంబర్ 2న పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోనూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో విద్యాసంస్థల సెలవులపై స్థానిక అధికారుల తాజా ప్రకటనలను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
* ప్రజలకు అధికారుల సూచనలు
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల సూచనలు పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలను సంప్రదించాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

