రాపర్తి రాజు
* ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఎం నేత రాపర్తి రాజు
Jangaon| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యుడు తోడెంగల ఐలయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్లో జనగామ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుకు ఆటంకం ఏర్పడిందని, అప్పులు చేసి సాగు చేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో కేవలం నాలుగు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదని అన్నారు. జిల్లావ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని గ్రామాల్లో నీటి లభ్యత ఉందనే కారణంతో కరువు లేదని భావించడం వాస్తవ పరిస్థితులను విస్మరించడమేనని పేర్కొన్నారు. గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి జనగామ జిల్లాను పూర్తిస్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు.
పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పత్తి పంటకు ఎకరాకు రూ.50 వేల చొప్పున, వరి పంటకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి, పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అన్నారు.
అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి ప్రతి కుటుంబానికి పని కల్పించాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఉచిత రేషన్ అందించాలని రాపర్తి రాజు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా చందు నాయక్, గట్ల మల్లారెడ్డి, చిలుముల్ల భాస్కర్, పోలాసు పరమేష్, మంగ బీరయ్య, బొంకురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

