నిందితుడు జ్యుడీషియల్ కస్టడీకి
* లేని అమ్మాయిల ఫొటోలతో పెళ్లి సంబంధాల వల
* నకిలీ మ్యాట్రిమోనీ కాల్ సెంటర్ గుట్టురట్టు
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్: పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న యువకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో అందమైన అమ్మాయిల నకిలీ ఫొటోలను సృష్టించి, వాటితో మ్యాట్రిమోనీ సేవల పేరుతో ప్రకటనలు ఇచ్చారు. పెళ్లి సంబంధాలు కుదురుస్తామంటూ యువకుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత ఫోన్ నంబర్లను బ్లాక్ చేశారు. ఇలా మూడు నెలలుగా పలు రాష్ట్రాలకు చెందిన యువకులను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. భిలాయ్‌లో నిర్వహిస్తున్న ఈ కేంద్రంపై పోలీసులు దాడి చేసి 24 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.
ఏఐ ఫొటోలతో నకిలీ సంబంధాలు
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు మూడు వేర్వేరు పేర్లతో సోషల్ మీడియాలో మ్యాట్రిమోనీ సేవల ప్రకటనలు ఇచ్చేవాడు. పెళ్లి సంబంధాలపై ఆసక్తి చూపిన యువకుల నుంచి బయోడేటా, అభిరుచులు, జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలు సేకరించేవారు. అనంతరం మహిళల ఫొటోలను చూపిస్తూ సంబంధాలు కుదిర్చే ప్రయత్నం చేసేవారు. అయితే ఆ ఫొటోల్లో ఉన్న మహిళలు నిజమైన వ్యక్తులు కాదని, ఏఐ సాయంతో సృష్టించిన కల్పిత చిత్రాలని పోలీసుల దర్యాప్తులో తేలింది.
రూ.2 వేలతో మొదలైన వసూళ్లు
యువకులతో నమ్మకంగా మాట్లాడిన తర్వాత పెళ్లి కౌన్సెలర్ల పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలకు అనుసంధానించిన క్యూఆర్ కోడ్లను పంపేవారు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 చెల్లించాలని కోరేవారు. ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ మరింత డబ్బు వసూలు చేసేవారు. డబ్బులు అందిన వెంటనే బాధితుల ఫోన్ నంబర్లను బ్లాక్ చేసి అందుబాటులో లేకుండా పోయేవారని పోలీసులు గుర్తించారు.
నలుగురు మహిళలకు ఉద్యోగాలు
అక్టోబర్ 29న అందిన సమాచారంతో సుపేలా పోలీసులు భిలాయ్‌లోని ఉత్తర గంగోత్రి భవన్లో యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఓ హాల్‌పై దాడి చేశారు. అక్కడ కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు మహిళలు ఉన్నారు. నెలకు రూ.7,000 జీతం ఇస్తామని చెప్పి తమను ఉద్యోగంలోకి తీసుకున్నారని, రెండు రోజుల శిక్షణ అనంతరం మ్యాట్రిమోనీ కౌన్సెలర్లుగా పనిచేయాలని సూచించారని వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ మోసం గురించి తమకు తెలియదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
రోజుకు 50 వరకు కాల్స్
ఈ కేంద్రం నుంచి రోజుకు సుమారు 20 నుంచి 50 కాల్స్ చేసేవారని దర్యాప్తులో వెల్లడైంది. కేంద్రానికి సంబంధించిన కొన్ని బ్యాంకు ఖాతాలపై ప్రభుత్వ సైబర్ క్రైమ్ సమన్వయ పోర్టల్ ‘సమన్వయ్’లోనూ ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
దాడి సమయంలో 22 కీప్యాడ్ ఫోన్లు, నాలుగు స్మార్ట్ఫోన్లు, 16 సిమ్ కార్డులు, కంప్యూటర్, వైఫై పరికరాలు, బ్యాంకు పత్రాలు, కస్టమర్ల వివరాలున్న రిజిస్టర్లు, రూ.1.64 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.2.83 లక్షలుగా అంచనా వేశారు.
నిందితుడు జ్యుడీషియల్ కస్టడీకి
ఈ ఘటనపై సుపేలా పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 317(2), 319(2) కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ మోసంలో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంత మొత్తం వసూలు చేశారు? మరికొందరి ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

