ఖైరా గ్రామం
* 141 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్
* 282 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
Chhattisgarh Solar Village| ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్: ఒకప్పుడు విద్యుత్ వినియోగదారులుగా ఉన్న గ్రామస్థులు.. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు చెందిన ఖైరా గ్రామం పునరుత్పాదక ఇంధన వినియోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గ్రామంలోని మొత్తం 141 ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో గ్రామం మొత్తం కలిపి 282 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద 100 శాతం ఇళ్లకు సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న దేశంలోని తొలి గ్రామంగా ఖైరా గుర్తింపు పొందినట్లు అధికారులు తెలిపారు.
* ఒక్కో ఇంటికి 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్
ఖైరా గ్రామంలో మొత్తం 889 మంది నివసిస్తున్నారు. ఇక్కడి 141 కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో మరో విశేషం ఏమిటంటే.. ఇళ్ల యజమానులు తమ జేబు నుంచి ఇన్స్టాలేషన్ ఖర్చులు చెల్లించాల్సిన అవసరం రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సబ్సిడీలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను వినియోగించి మిగిలిన ఖర్చులను భరించారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా సౌర విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 141 ఇళ్లలో 93 ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ పథకం లబ్ధిదారులకు చెందినవి. గ్రామంలో 88 మంది సభ్యులతో కూడిన 21 షెడ్యూల్డ్ తెగల కుటుంబాలు, 18 మంది సభ్యులతో కూడిన నాలుగు షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు కూడా ఉన్నాయి.
* ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించిన మహిళలు
ఖైరా గ్రామం ఈ లక్ష్యాన్ని సాధించడంలో స్థానిక మహిళల పాత్ర కీలకంగా నిలిచింది. పీఎం సూర్య సఖీలుగా గుర్తింపు పొందిన మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పథకం గురించి వివరించారు. సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు అయ్యే ఖర్చులు, సబ్సిడీలు, ప్రయోజనాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. దరఖాస్తులు, అవసరమైన పత్రాల సమర్పణలోనూ కుటుంబాలకు సహకరించారు. స్థానికంగా సంగీతా సాహు ఈ కార్యక్రమంలో కీలకంగా పనిచేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఫూల్బాసన్ బాయి యాదవ్‌తో అనుబంధం ఉన్న స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడింది. గ్రామసభలు, బ్యాంకింగ్ శిబిరాల ద్వారా ప్రజలు పదేపదే బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేశారు.
* పేద కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గే అవకాశం
పెన్షన్లు, వ్యవసాయం, రోజువారీ కూలీ పనులపై ఆధారపడే కుటుంబాలకు ఈ సోలార్ వ్యవస్థలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రతి నెలా చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందనే ఆశ గ్రామస్థుల్లో కనిపిస్తోంది. ఒంటరిగా నివసిస్తూ పెన్షన్‌పై ఆధారపడుతున్న షోహ్గిల్ గొండ్ అనే వితంతువు.. ఇంటిపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు కావడంతో నెలవారీ విద్యుత్ బిల్లుల గురించి ఉండే ఆందోళన తగ్గిందని తెలిపారు.
* మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపే అవకాశం
ఖైరా గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థలకు నెట్ మీటరింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఇంటి అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించవచ్చు. దీంతో గ్రామస్థులు కేవలం విద్యుత్ వినియోగదారులుగానే కాకుండా, విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములుగా మారే అవకాశం లభించింది.
ప్రభుత్వ పథకాలు, కార్పొరేట్ నిధులు, స్థానిక మహిళల కృషి కలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని విస్తరించవచ్చని ఖైరా గ్రామం నిరూపిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా సౌర విద్యుత్‌ను చేరువ చేయడంలో ఈ గ్రామం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

