రష్యా ఆర్మీలో తెలుగు యువకులు
* కాపాడాలంటూ వేడుకోలు
* స్పందించిన మంత్రి నారా లోకేష్
ఆకేరు న్యూస్, డెస్క్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు రష్యా సైన్యంలో చిక్కుకుని ప్రాణభయంతో అల్లాడుతున్నారు. ఉద్యోగం పేరుతో తమను మోసం చేసి రష్యా ఆర్మీలో చేర్పించారని, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమను ఎలాగైనా కాపాడి స్వదేశానికి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యువకులు వేడుకున్నారు.
ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగమంటూ మోసం?
బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదుగురు యువకులు ఉపాధి కోసం రష్యాకు వెళ్లారు. అక్కడ పరిచయమైన ఓ నేపాలీ వ్యక్తి ఆర్మీలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి వారిని సైన్యంలో చేర్పించినట్లు ఆరోపిస్తున్నారు. రష్యన్ భాషలో ఉన్న పత్రాలపై తమకు తెలియకుండానే సంతకాలు చేయించుకున్నారని, వాటి అసలు వివరాలు తమకు తెలియవని వాపోయారు. అనంతరం తమను రష్యా–ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ప్రమాదకర ప్రాంతాలకు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఇవే మా ఆఖరి మాటలు కావచ్చు’
తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామని, అక్కడి పరిస్థితులు ఊహించని విధంగా ఉన్నాయని యువకులు వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు. “ఇంత ప్రమాదకరంగా ఉంటుందని మాకు తెలియదు. తెలియక మోసపోయాం. ఇవే మా ఆఖరి మాటలు కావచ్చు. ప్రధాని నరేంద్ర మోదీగారూ మా ప్రాణాలు కాపాడండి. ఈ వీడియో మీ వరకు చేరేలా చూడండి” అంటూ వేడుకున్నారు. బాధితులు విశాఖపట్నానికి చెందిన యువకులుగా గుర్తించినట్లు సమాచారం.
కుమారుడిని కాపాడాలంటూ తల్లి వేడుకోలు
రష్యా ఆర్మీలో చిక్కుకున్న వంశీ అనే యువకుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వంశీ తల్లి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమ బిడ్డను కాపాడాలని కన్నీరుమున్నీరవుతున్నారు.
స్పందించిన మంత్రి నారా లోకేష్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి బాధాకరంగా ఉందని పేర్కొంటూ, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు. వారు సురక్షితంగా, వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా చర్యలు చేపడుతోంది. శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో 259 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారిలో 139 మందిని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. మరో 69 మందిని వెనక్కి రప్పించేందుకు మాస్కోలోని అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మిగిలిన భారతీయుల పరిస్థితిపై కూడా అధికారులు దృష్టి సారించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

