MLA Mamidala Yashaswini Reddy directed officials to speed up the development Sannur Temple
* పనులు త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్ ,రాయపర్తి : రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు.
* ఆలయ పునర్నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష
రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి మంగళవారం ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, జిల్లా కలెక్టర్ సత్య శారదకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రముఖులు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు..
ఈ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణాల వివరాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనులన్నింటినీ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
* రూ.10 కోట్ల నిధుల కేటాయింపు – పనుల వివరాలు..
కోనేరు నిర్మాణం : రూ. 261.89 లక్షలు
ప్రాకార గోడ నిర్మాణం : రూ. 242.24 లక్షలు
శివాలయ నిర్మాణం : రూ. 120.00 లక్షలు
ఆలయ సుందరీకరణ : రూ. 60.00 లక్షలు
అనివెట్టి మండపం : రూ. 57.28 లక్షలు
పోర్టికో మండపం : రూ. 39.89 లక్షలు
శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం : రూ. 15.94 లక్షలు
* పనుల పురోగతి..
ఇప్పటివరకు అనివెట్టి మండపం, పోర్టికో మండపం, ప్రాకార గోడ, ఔటర్ ప్రాకార గోడల నిర్మాణాలు పూర్తయ్యాయి. అనివెట్టి, పోర్టికో మండపాల సుందరీకరణ, ప్రవేశ ద్వారాలు, కోనేరు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శివాలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన సన్నూరు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

