AP Municipal Elections Results
* కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కూటమి ప్రభంజనం
* ఎక్కడ చూసినా అధికార పార్టీదే హవా
* చతికిలిపడ్డ ప్రతిపక్ష పార్టీ వైసీపీ
* 13 కార్పొరేషన్లలో 12 కూటమికే..
* అనంతపురంలో గెలుపు దోబూచులాట
* 87 మునిసిపాల్టీల్లో వైసీపీకి మూడే
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 13 మునిసిపల్ కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించడం సంచలనం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూటమి అభ్యర్థుల జెండాలే రెపరెపలాడాయి. వైసీపీ కంచుకోట పులివెందులలోనూ ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికలు జరిగిన 86 మునిసిపాలిటీల్లో 83 స్థానాల్లో కూటమి పాగా వేసింది. కూటమి అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా అనంతపురం కార్పొరేషన్ లో గెలుపు దోబూచులాడుతోంది. లెక్కింపు కొనసాగుతోంది.
* వై నాట్ పులివెందుల..
ఏపీలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అంతటా ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లో సింహభాగం స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముఖ్యంగా మేయర్, చైర్పర్సన్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. తొలి రౌండ్ కౌంటింగ్ నుంచే స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కూటమి పార్టీలు, పట్టణ ఓటర్ల సంపూర్ణ మద్దతును సొంతం చేసుకున్నాయి.
ఈ ఎన్నికల్లో అత్యంత హైలైట్‌గా నిలిచిన పరిణామం కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోవడం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పులివెందుల పురపీఠాన్ని కూటమి దక్కించుకోవడం ఇదే మొదటిసారి. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని కోటగా ఉన్న ప్రాంతంలో స్థానిక ప్రజలు మార్పును కోరుకుంటూ కూటమి వైపు మొగ్గు చూపడం వైయస్సార్సీపీకి ఊహించని రాజకీయ షాక్‌గా మారింది. “వై నాట్ పులివెందుల” అని సవాళ్లు విసిరిన గడ్డపైనే కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 40 స్థానాలకు గాను టీడీపీ 34, జనసేన 3 బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి.
* వార్ వన్ సైడే..
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన రిగ్గింగ్, ప్రలోభాల ఆరోపణలను పట్టణ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. పులివెందులతో పాటు పుంగనూరు, కుప్పం వంటి ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగరేయడం ద్వారా, ఈ ఫలితాలు కేవలం ప్రలోభాలతో వచ్చినవి కాదని, ప్రభుత్వ పాలనపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని తేలిపోయింది. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఒకవైపే నిలబడినట్లుగా ఫలితాలు కనిపిస్తున్నాయి.
* సమన్వయ ఫలాలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించాయి. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతల మధ్య కుదిరిన అద్భుతమైన సమన్వయం, క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ సజావుగా జరగడం కూటమి విజయాన్ని సులువు చేశాయి. సీట్ల సర్దుబాటు తేడా కొడుతుందని, రెబల్స్ గండి కొడతారని ప్రతిపక్షాలు చేసిన అంచనాలు పూర్తిగా పటాపంచలయ్యాయి.
* జనసేనలో సేమ్ సీన్ రిపీట్..
సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరును ప్రదర్శించింది. విజయవాడ మేయర్ పీఠంతో పాటు పిఠాపురం, నిడదవోలు, గొల్లప్రోలు, పుట్టపర్తి వంటి అనేక చోట్ల జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు. అలాగే బీజేపీ కూడా తమకు కేటాయించిన స్థానాల్లో, డివిజన్లలో కూటమి విజయానికి తమ వంతు సహకారాన్ని అందిస్తూ పట్టు నిరూపించుకుంది.
* వర్షాలు, బ్యాలెట్ల లెక్కింపులో ఉత్కంఠ
పోలింగ్ ముగిసిన తర్వాత చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగింది. కొన్ని ప్రాంతాలలో తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా కౌంటింగ్ ఏర్పాట్లలో చిన్నపాటి మార్పులు జరిగినప్పటికీ, ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. బ్యాలెట్ పత్రాల లెక్కింపు కావడంతో సిబ్బంది ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఫలితాలను వెల్లడించారు. రాత్రి పొద్దుపోయే వరకు హోరాహోరీగా లెక్కింపు కొనసాగింది.
* కూటమిలో తారాస్థాయికి ఉత్సాహం..
ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం స్థానిక సంస్థల పదవులకే పరిమితం కాకుండా, రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయ దిశానిర్దేశాన్ని స్పష్టం చేసేవిగా నిలిచాయి. ప్రభుత్వ విధానాలకు పట్టణ ఓటర్లు మరోసారి బ్రహ్మరథం పట్టడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. సుపరిపాలన, స్థిరమైన అభివృద్ధే ప్రధాన ప్రాతిపదికగా ప్రజలు రాజకీయ తీర్పునిస్తారనే సత్యానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి.
కార్పొరేషన్ లలో గెలిచిన అభ్యర్థులు వీరే..
* విజయవాడ – వంగవీటి రాధాకృష్ణ (జనసేన)
* విశాఖపట్టణం – ముక్కా శ్రావణి (టీడీపీ)
* విజయనగరం – అవినాపు భార్గవి (టీడీపీ)
* ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు (టీడీపీ)
* గుంటూరు – కె.లక్ష్మీ అపర్ణ (టీడీపీ)
* మచిలీపట్టణం – అబ్దుల్ అబిదా (టీడీపీ)
* కర్నూలు – వి.విజయ ప్రత్యూష (టీడీపీ)
* కడప – ఎం సువర్ణ (టీడీపీ)
* చిత్తూరు – కఠారి హేమలత (టీడీపీ)
* విశాఖపట్టణం – ముక్కా శ్రావణి (టీడీపీ)
* నెల్లూరు – రూప్ కుమార్ యాదవ్ (టీడీపీ)
* తిరుపతి – ఎం.శ్రీనివాస ప్రసాద్ (టీడీపీ)
* అనంతరంపురం.. ఒంగోలు ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదీ లెక్క..
* కార్పొరేషన్లు
* మొత్తం కార్పొరేషన్లు- 13
* టీడీపీ 10, జనసేన 2, వైసీపీ 1 (ఆధిక్యత)
* కార్పొరేషన్ డివిజన్లు
* మొత్తం- 622
* టీడీపీ 403, జనసేన 100, బీజేపీ 24 , వైసీపీ 68, ఇతరులు 30
మునిసిపాలిటీలు
* మొత్తం 87
* టీడీపీ 59.. జనసే 16.. బీజేపీ 4
* వైసీపీ 3 ఇతరులు 2
వార్డులు..
* మొత్తం : 3020
* కూటమి గెలిచినవి 2231 (టీడీపీ1805 జనసే324 బీజేపీ102).
* వైసీపీ 343, ఇతరులు 92.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

