హీరో సూర్య
* ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నాం – హీరో సూర్య
* ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర బృందం
Suriya ఆకేరు న్యూస్, సినిమా: హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’(Scene). నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నవంబర్ 6న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది.
* ‘సీన్’లో మర్డర్ మిస్టరీ, మ్యాడ్నెస్, నవ్వులు
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు తనకు ఎప్పుడూ ఎంతో ప్రేమాభిమానాలు అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మూడోసారి తెలుగు ప్రేక్షకులను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
పాన్ ఇండియా సినిమాల గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారని, అయితే నాగార్జున వంటి నటులు గతంలోనే వివిధ భాషల దర్శకులతో కలిసి సినిమాలు చేశారని గుర్తుచేశారు. మణిరత్నం, ప్రియదర్శన్, మహేష్ భట్ వంటి దర్శకులతో పనిచేసిన అనుభవాలు భారతీయ సినిమా పరిశ్రమల మధ్య అనుబంధానికి ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సూర్య చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలను ప్రేక్షకులు చూసే ఉంటారని, ‘సీన్’ కూడా అలాంటి అందమైన చిత్రమని అన్నారు. తమ చిత్ర బృందం ఎంతో కష్టపడి మంచి సినిమాను అందించిందని తెలిపారు.
“ఈ సినిమాలో మర్డర్ మిస్టరీ, మ్యాడ్నెస్, నవ్వులు.. అన్నీ ఉంటాయి. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్లకు వచ్చి సినిమాను చూడొచ్చు. ఈ దీపావళిని ‘సీన్’తో సెలబ్రేట్ చేసుకుందాం” అని సూర్య ప్రేక్షకులను కోరారు.
* నజ్రియా యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ
హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించానని తెలిపారు. తనకు ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని అందించిన స్టంట్ మాస్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు.
జిత్తు మాధవన్ తనకు చాలా ప్రత్యేకమైన ‘మాయ’ పాత్రను ఇచ్చారని, ఆ పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుందని వివరించారు. సూర్యతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. నవంబర్ 6న ప్రేక్షకులంతా థియేటర్లలో సినిమాను చూడాలని కోరారు.
* సూర్య హ్యాట్రిక్ హిట్ కొట్టాలి – వెంకీ అట్లూరి
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సూర్య ఈ ఏడాది మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని చెప్పారు. ఆయన సినిమాపై చూపించే అంకితభావం, కష్టాన్ని అభిమానులుగా అభినందించాలని అన్నారు. ‘సీన్’తో సూర్య హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
* సూర్య పాత్రలో మాస్, ఎంటర్టైన్మెంట్
గీత రచయిత రాకేందు మౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సూర్య పాత్ర ‘సింగం’, ‘శివపుత్రుడు’ పాత్రల మిశ్రమంలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మాస్ అంశాలతో పాటు వినోదం కూడా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు పాటలు, సంభాషణలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులకు తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని పేర్కొన్నారు.
* దీపావళికి ప్రేక్షకులకు మంచి వినోదం
సహ నిర్మాత జయశ్రీ దామోదరన్ మాట్లాడుతూ.. అగరం స్టూడియోస్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదని తెలిపారు. సూర్య సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని చెప్పారు. ఈ దీపావళికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించే చిత్రంగా ‘సీన్’ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల పంపిణీదారుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. సూర్య కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని, ఈ ఏడాది వచ్చిన ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత ‘సీన్’ కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమా సూర్య కెరీర్లో కొత్త తరహా చిత్రంగా నిలుస్తుందని అన్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
* నవంబర్ 6న థియేటర్లలోకి ‘సీన్’
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మిస్టరీ, యాక్షన్, కామెడీ, కుటుంబ భావోద్వేగాల కలయికగా తెరకెక్కిన ‘సీన్’ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

