Telangana Employees Demands (File Photo)
* పీఆర్సీ.. ఓపీఎస్.. పెండింగ్ బిల్లులు
* ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రెండో పే రివిజన్ కమిటీ (పీఆర్సీ) నివేదికను వెంటనే ప్రకటించి, 51 శాతం ఫిట్మెంట్తో 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని కోరింది.
పెండింగ్ బిల్లుల కోసం నిధులు పెంచాలి
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రస్తుతం నెలకు విడుదల చేస్తున్న రూ.1,000 కోట్లను రూ.2,000 కోట్లకు పెంచాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప కాంప్లెక్స్‌లో ఉన్న టీజీఓ భవన్లో జేఏసీ విస్తృత కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.
మూడేళ్లుగా పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు
రెండో పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని జేఏసీ పేర్కొంది. జూన్ 2లోపు పీఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు కాలేదని గుర్తుచేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నివేదికను ప్రకటించాలని డిమాండ్ చేసింది.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి
ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని జేఏసీ కోరింది. ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకం లేదా నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
రెండు నెలలకోసారి స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని జేఏసీ కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ చూపాలని సూచించింది. దీపావళి తర్వాత మరో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, తదుపరి ప్రత్యక్ష కార్యాచరణను రూపొందించాలని జేఏసీ నిర్ణయించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

