Police Constable Srinu (File Photo)
* నగ్న చిత్రాలతో బెదిరింపులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరో నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. సకాలంలో అప్పు చెల్లించలేదనేకారణంతో లోన్ యాప్ సిబ్బంది చేసిన తీవ్రమైన మానసిక వేధింపులకు బలై ఓ పోలీస్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీను కొంతకాలం కిందట కుటుంబ అవసరాల నిమిత్తం ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ. 40 వేల రుణం తీసుకున్నాడు. అయితే వివిధ వ్యక్తిగత కారణాల వల్ల ఆ అప్పును సకాలంలో పూర్తిగా చెల్లించలేకపోయాడు.
నిర్ణీత గడువు దాటిపోవడంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు వేధింపులు మొదలయ్యాయి. అసలు రుణం కంటే వడ్డీలు, జరిమానాలు విపరీతంగా పెంచేసి వారి నుంచి ఒత్తిడి తెచ్చారు. కేవలం అప్పు చెల్లించమని అడగడమే కాకుండా, క్షణానికో, గంటకోసారి ఫోన్లు చేస్తూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.
* నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్
లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులు హద్దులు దాటాయి. శ్రీను మొబైల్ ఫోన్లోని కాంటాక్ట్ డెటా మొత్తాన్ని హ్యాక్ చేసిన నిందితులు, ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మలిచారు. ఆ అశ్లీల చిత్రాలను శ్రీను కుటుంబ సభ్యులకు, బంధువులకు చివరికి ఆయన పనిచేస్తున్న గ్రామస్థులకు, సహోద్యోగులకు పంపిస్తామంటూ తీవ్రస్థాయిలో బ్లాక్మెయిల్ చేశారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో శ్రీను లోలోపల తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
* తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య
లోన్ యాప్ సిబ్బంది రోజూ చేస్తున్న బెదిరింపులు, మానసిక వేధింపులను తట్టుకోలేక శ్రీను తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని భరించలేక తన ఇంట్లోనే ఎూరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పోలీసుల దర్యాప్తు ముమ్మరం
మృతుడి భార్య మరియు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏయే లోన్ యాప్ల నుంచి శ్రీనుకు ఫోన్లు వచ్చాయి? ఆ నంబర్లు ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉన్నాయి? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. అప్పుల ఊబిలో ఇరికించి, బ్లాక్మెయిల్ చేసి ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించిన లోన్ యాప్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

