కల్వకుంట్ల కవిత
* పట్టభద్రులు తమ అభ్యర్థులను గెలిపించాలి
* కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha| ఆకేరు న్యూస్, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు బీసీ అభ్యర్థులను పట్టభద్రులు ఆదరించి గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల ద్వారా తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. డబ్బులు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరితో కలిసి కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే యువతకు పట్టభద్రులు అండగా నిలవాలని కోరారు.
రెండు స్థానాల్లో బీసీ అభ్యర్థులు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరి, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. ఇద్దరూ విద్యావంతులైన యువకులని, ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ రెండు స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆకాశ్ కొల్లూరి కుమ్మరి సామాజిక వర్గానికి చెందినవారని, ఆ వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చామని వివరించారు. ఒకరు ఉస్మానియా యూనివర్సిటీకి, మరొకరు కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నారని పేర్కొన్నారు.
డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కవిత సూచించారు. గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారనే అపవాదును తొలగించుకోవాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి తావివ్వకుండా ప్రజల సమస్యలపై పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు.
రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది డిగ్రీ అర్హత కలిగినవారు ఉన్నారని, వారంతా ఎన్నికలపై అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులుంటే పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యే సభ్యులు ముగ్గురేనని గుర్తుచేశారు. మండలిలో ప్రజా సమస్యలపై బలమైన స్వరం వినిపించే ప్రతినిధులు ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నదీ జలాల హక్కుల సాధన, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో సుమారు 75 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని, భావసారూప్యత కలిగిన పార్టీల మద్దతు కూడా కోరనున్నట్లు వెల్లడించారు.
మహిళలకు 50 శాతం సీట్లు
రాజకీయాల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు తమ పార్టీ భవిష్యత్తులో 33 నుంచి 50 శాతం వరకు సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్లు అమలులో ఉన్నా లేకపోయినా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మహిళా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నప్పటికీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చామని వివరించారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ గుర్తింపు ప్రక్రియ ఎన్నికల సంఘం వద్ద కొనసాగుతోందని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జీలు డాక్టర్ రఘు, సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్లు గొంగళ్ల రంజిత్, అర్చనా సేనాపతి, వాసిలి చంద్రశేఖర్, రామ్ కళ్యాణ్ చల్లా, మతిన్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

