సీఎం రేవంత్ రెడ్డి
* సీఎం రేవంత్ కీలక ప్రకటన
* నైట్ ఎకానమీతో యువతకు ఉద్యోగాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ పరిసర ప్రాంతాలను ఆధునిక సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, అక్కడ నైట్ ఎకానమీ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లోని బంజారా భవన్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు గతంలో ఉన్న చారిత్రక వైభవాన్ని తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఓల్డ్ సిటీగా కాకుండా ఒరిజినల్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు పొందేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఆకర్షితులయ్యేలా మూసీ రివర్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
విద్యతో పాటు నైపుణ్యాలకూ ప్రాధాన్యత
స్వాతంత్య్రం అనంతరం దేశ అభివృద్ధిలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముఖ్యమైన వ్యక్తి అని సీఎం గుర్తుచేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఐఐటీల ఏర్పాటుకు పునాదులు పడ్డాయని తెలిపారు. విద్యా రంగంలో ఆయన చేసిన కృషి దేశానికి ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, తదుపరి దశలో నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారు.
మైనారిటీ వర్గాల్లోనూ ఎంతో ప్రతిభ కలిగిన యువత ఉన్నారని, తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. చదువుపై ఆసక్తి తక్కువగా ఉన్న పిల్లలకు వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించాలని, క్రీడలపై ఆసక్తి ఉన్నవారిని ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నారు. మారుతున్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మైనారిటీల అభివృద్ధితోనే దేశ ప్రగతి
దేశ జనాభాలో మైనారిటీల వాటా గణనీయంగా ఉందని, ఆ వర్గాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం సమగ్ర పురోగతి సాధిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. మైనారిటీల్లో పేదరికాన్ని తగ్గించేందుకు సచార్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.
పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో నిరుపేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
మెట్రో విస్తరణ, మీరాలం ట్యాంక్ అభివృద్ధి
నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు విస్తరణ పనులను రాబోయే రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మీరాలం ట్యాంక్‌ను కూడా వచ్చే ఏడాది కాలంలో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో విస్తరణ, మీరాలం ట్యాంక్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంతో పాటు పర్యాటక రంగానికి, స్థానిక ఉపాధికి కొత్త అవకాశాలను తీసుకొస్తాయని సీఎం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, వి. హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, టీజీఎంఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

