Nvidia Jensen Huang Succession Plan
* కుమార్తె, కుమారుడు, అల్లుడు పేర్లపై ఆసక్తి
* వారసుడిపై అధికారిక ప్రకటన లేనట్టే!
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన చిప్ దిగ్గజం ఎన్విడియా ఇప్పుడు నాయకత్వ సంక్షోభంపై చర్చల్లో నిలిచింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ భవిష్యత్తుపై బోర్డు స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కుమార్తె మేడిసన్ హువాంగ్, కుమారుడు స్పెన్సర్ హువాంగ్, అల్లుడు నికో కాప్రెజ్ ఇప్పటికే ఎన్విడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటంతో.. భవిష్యత్తులో కంపెనీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయన్న ఆసక్తి నెలకొంది.
* జెన్సన్ హువాంగ్ భవిష్యత్తుపై బోర్డు చర్చలు
1993లో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) మరో ఇద్దరితో కలిసి ఎన్విడియాను స్థాపించారు. మూడు దశాబ్దాలకు పైగా కంపెనీకి నాయకత్వం వహిస్తూ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ల రంగంలో ఎన్విడియాను అగ్రస్థానానికి తీసుకెళ్లారు. ఇటీవల ఆయన వ్యక్తిగత వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించిన విచారణ నేపథ్యంలో కంపెనీ పాలన, నాయకత్వంపై చర్చ మొదలైంది. స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన కమిటీ, బయటి న్యాయ సలహాదారుల సహాయంతో విచారణ చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 11న జెన్సన్ హువాంగ్ను పదవి నుంచి తొలగించే అంశంపై బోర్డు సమావేశమైనట్లు రాయిటర్స్ నివేదించింది. అయితే ఈ విషయంలో కంపెనీ నుంచి తుది నిర్ణయం వెలువడినట్లు సమాచారం లేదు.
* కుమార్తె మేడిసన్ హువాంగ్..
జెన్సన్ హువాంగ్ కుమార్తె మేడిసన్ హువాంగ్ (Madison Huang) ఎన్విడియాలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రొడక్ట్ మార్కెటింగ్, ముఖ్యంగా ఓమ్నివర్స్ (Omniverse), ఫిజికల్ ఏఐ, రోబోటిక్స్ వంటి విభాగాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఉంది. ఎన్విడియా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాక్సీ ప్రకటన ప్రకారం.. మేడిసన్ మొత్తం వేతన ప్యాకేజీ సుమారు 12.32 లక్షల అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది మారకపు విలువను బట్టి సుమారు రూ.10 కోట్లకు పైమాటే.
* కుమారుడు స్పెన్సర్..
జెన్సన్ కుమారుడు స్పెన్సర్ హువాంగ్ (Spencer Huang) ఎన్విడియాలో రోబోటిక్స్, సిమ్యులేషన్ సంబంధిత విభాగాల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం వేతన ప్యాకేజీ సుమారు 13.20 లక్షల డాలర్లుగా కంపెనీ ప్రాక్సీ ప్రకటనలో వెల్లడైంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.11 కోట్లకు పైగా ఉంటుంది.
* అల్లుడు నికో కాప్రెజ్..
మేడిసన్ భర్త నికో కాప్రెజ్ కూడా ఎన్విడియాలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2024లో కంపెనీలో చేరిన ఆయన ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలతో సంబంధాలు, కార్పొరేట్ వ్యూహాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
* కుటుంబ సభ్యులే వారసులా
జెన్సన్ హువాంగ్ కుటుంబ సభ్యులు ముగ్గురూ కంపెనీలో కీలక స్థానాల్లో ఉండటంతో వారిలో ఎవరో ఒకరు భవిష్యత్తులో సీఈఓ బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మేడిసన్, స్పెన్సర్, నికో కాప్రెజ్లలో ఎవరినీ తన వారసుడిగా ఎన్విడియా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే వారిలో ఎవరు సీఈఓ పదవికి ఎంపికవుతారనే దానిపై కూడా స్పష్టత లేదు. కంపెనీ అధికారిక ప్రాక్సీ ప్రకటనలో మేడిసన్, స్పెన్సర్ ఇద్దరూ జెన్సన్ హువాంగ్‌కు నేరుగా రిపోర్ట్ చేయరని, వారు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కాదని పేర్కొంది. వారి వేతనాలను కూడా సమాన బాధ్యతలు నిర్వహించే ఇతర ఉద్యోగుల వేతన విధానాల ప్రకారమే నిర్ణయించినట్లు వెల్లడించింది.
* వారసత్వ ప్రణాళికపై స్పష్టత ఎప్పుడు
జెన్సన్ హువాంగ్ ఎన్విడియాలో సుమారు 3.6 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆయన నాయకత్వంలో కంపెనీ ప్రపంచ ఏఐ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమయంలో నాయకత్వ మార్పు జరిగితే కంపెనీ భవిష్యత్తు వ్యూహాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్ తాత్కాలిక నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఇది కూడా అధికారిక నిర్ణయం కాదు. ప్రస్తుతం ఎన్విడియా ముందున్న ప్రధాన ప్రశ్న జెన్సన్ హువాంగ్ స్థానంలో ఎవరు వస్తారన్నదే. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా? లేక కంపెనీకి చెందిన అనుభవజ్ఞులైన ఇతర ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిని ఎంపిక చేస్తారా? అన్నది వేచి చూడాలి. ఈ వ్యవహారంపై కంపెనీ బోర్డు తీసుకునే నిర్ణయం టెక్నాలజీ పరిశ్రమతో పాటు ప్రపంచ పెట్టుబడి మార్కెట్లలోనూ ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

