Warangal PDS Rice Scam
* రూ. 3.03 కోట్ల ప్రభుత్వ ధాన్యం అక్రమ విక్రయం!
* ఐదుగురు రైస్ మిల్లు భాగస్వాముల అరెస్ట్, జైలుకు తరలింపు
* వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఘటన
ఆకేరు న్యూస్, రాయపర్తి: పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లక్ష్యానికి కొందరు అంతులేని ఆశతో తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిధులను, ధాన్యాన్ని అడ్డగోలుగా దోచుకుంటూ పేదల కడుపు కొడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం అక్రమ రవాణా ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
* అక్రమాల చిట్టా ఇదీ..
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ‘మెస్సర్స్ పరమేశ్వరి రైస్ ఇండస్ట్రీస్’ మిల్లు యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చింది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (TGCSCL) ఆధ్వర్యంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ప్రక్రియ నిమిత్తం ఈ మిల్లుకు భారీగా ప్రభుత్వ ధాన్యాన్ని కేటాయించారు. కానీ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యాజమాన్యం ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించింది ..
2022-2023 రబీ సీజన్: ఐకేపీ, సొసైటీ కేంద్రాల ద్వారా సేకరించిన 467.426 మెట్రిక్ టన్నుల ధాన్యం.
2023-2024 ఖరీఫ్ సీజన్: మరో 468.708 మెట్రిక్ టన్నుల ధాన్యం.
ఈ రెండు సీజన్లకు సంబంధించి మిల్లులో నిల్వ చేసిన మొత్తం ధాన్యం విలువ బహిరంగ మార్కెట్ లెక్కల ప్రకారం అక్షరాలా రూ.3,03,13,436 (సుమారు రూ. 3.03 కోట్లు)గా తేలింది.
* డబ్బుల పంపకం – భాగస్వాముల బాగోతం..
ప్రభుత్వానికి సీఎంఆర్ (CMR) రూపంలో నిర్ణీత గడువులోగా నాణ్యమైన బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సిన ఈ మిల్లు… ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండానే అక్రమంగా బయటి మార్కెట్లో విక్రయించేసింది. వచ్చిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని మిల్లు భాగస్వాములైన చిర్రా ఉపేంద్ర, పుల్ల ఎల్ల గౌడ్, ఆవుల కేశవ రెడ్డి, అలువల ప్రభాకర్ రెడ్డి, వంగల నర్సయ్య ఐదుగురూ కలిసి అక్రమంగా పంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
* అధికారుల కొరడా – జైలుపాలు..
ఈ భారీ గోల్మాల్పై వరంగల్ జిల్లా సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బి. సంధ్యారాణి ఇచ్చిన పక్కా ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు కూపీ లాగారు. పేదల బియ్యాన్ని దళారీ మార్గంలో విక్రయించి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం కలిగించిన ఈ ఐదుగురు భాగస్వాముల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు సమాచారం.
* ప్రజల ఆగ్రహం – కఠిన చర్యలకు డిమాండ్..
రేషన్ బియ్యాన్ని మింగేస్తున్న ఇలాంటి కేటుగాళ్లపై ప్రభుత్వం మరింత ఉక్కుపాదం మోపాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలు ఎక్కడా పక్కదారి పట్టకుండా సివిల్ సప్లైస్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు, పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

