మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (ఫైల్ ఫోటో)
* మంత్రి తుమ్మల కీలక ప్రకటన!
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అమ్మగారిపల్లి, దుమ్ముగూడెం ప్రాంతాల్లో మంత్రి పర్యటించి గోదావరి నీటి నిల్వకు చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని, గోదావరి నదిలోనూ గతంతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేదని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరిలో వచ్చే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
* సీతమ్మసాగర్తో 36 టీఎంసీల నీటి నిల్వ..
సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు త్వరలోనే అవసరమైన అన్ని అనుమతులు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 36 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా మూడు జిల్లాలకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందని తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు.
* సమ్మక్క-సారక్క బ్యారేజీ వద్ద నీటి నిల్వకు చర్యలు..
సమ్మక్క-సారక్క బ్యారేజీ పరిధిలోనూ నీటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏర్పాట్ల ద్వారా ఐదు జిల్లాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడవచ్చని తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు, తగ్గిన గోదావరి వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా, వ్యవసాయ అవసరాలకు నీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

