తెలంగాణ ఎలక్ట్రిక్ బస్సులు (ఫైల్ ఫోటో)
* 250 బస్సులు ఇక ఎలక్ట్రిక్‌గా
* ఒక్క ఛార్జింగ్‌తో 250 KM ప్రయాణం
* ఎలక్ట్రిక్ బస్సులుగా TGSRTC పాత బస్సులు
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. డీజిల్ వినియోగాన్ని తగ్గించి, నిర్వహణ ఖర్చులను ఆదా చేసే లక్ష్యంతో పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా (TGSRTC Electric Buses) మారుస్తోంది. ఇందుకోసం చేపట్టిన రెట్రోఫిట్టింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఉప్పల్, మియాపూర్‌తో పాటు కరీంనగర్ వర్క్‌షాప్‌లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
* 250 బస్సులకు ఎలక్ట్రిక్ హంగులు..
TGSRTC చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 250 పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా (TGSRTC Electric Buses) మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఉప్పల్ వర్క్‌షాప్‌లో 200 బస్సులు, మియాపూర్‌లో 40 బస్సులు, కరీంనగర్లో మరో 10 బస్సులను ఆధునిక సాంకేతికతతో మారుస్తున్నారు. బస్సుల్లోని పాత డీజిల్ ఇంజిన్లు, ఇంధన వ్యవస్థ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ ప్యాక్‌లు, ఇతర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.
* ఒక్కసారి ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్లు..
ఈ బస్సుల్లో 300 kWh సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చుతున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 230 నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాటరీల జీవితకాలం పెంచేందుకు ఛార్జింగ్‌ను 80 శాతానికి పరిమితం చేసినప్పటికీ అవసరమైన ప్రయాణ దూరాన్ని చేరుకునేలా సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కిలోమీటరు ప్రయాణానికి ఒక యూనిట్ కంటే తక్కువ విద్యుత్ వినియోగం అవుతుందని సమాచారం.
* కిలోమీటరుకు రూ.20 వరకు ఆదా..
డీజిల్ బస్సుల నిర్వహణతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం డీజిల్ బస్సుల నిర్వహణకు కిలోమీటరుకు సుమారు రూ.80 నుంచి రూ.85 వరకు ఖర్చవుతుండగా, ఎలక్ట్రిక్‌గా మార్చిన తర్వాత దాదాపు రూ.20 వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సంస్థపై ఇంధన వ్యయం తగ్గి ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
* ఛార్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
బస్సులు ఎక్కువ సమయం డిపోల్లోనే నిలిచిపోకుండా ఛార్జింగ్ సదుపాయాలను కూడా మెరుగుపరుస్తున్నారు. రద్దీ సమయాల్లో అవసరమైనప్పుడు తక్కువ సమయంలో అదనపు ఛార్జింగ్ చేసుకునేలా ఆపర్చునిటీ ఛార్జింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళిక ఉంది. దీనివల్ల బస్సుల వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.
* కాలుష్య నియంత్రణకు మరో అడుగు..
డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం వల్ల పొగ ఉద్గారాలు, శబ్ద కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజా రవాణాను పర్యావరణహితంగా మార్చేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇప్పటికే ఉన్న బస్సులను పూర్తిగా కొత్త వాహనాలతో భర్తీ చేయకుండా ఆధునిక సాంకేతికతతో మార్పులు చేయడం ఈ ప్రాజెక్టులో ప్రత్యేకతగా నిలుస్తోంది.
మొత్తంగా TGSRTC చేపట్టిన ఈ డీజిల్ టు ఎలక్ట్రిక్ బస్సుల మార్పిడి కార్యక్రమం విజయవంతమైతే ప్రజా రవాణా రంగంలో మరో కీలక మార్పుకు నాంది పలికినట్లవుతుంది. నిర్వహణ ఖర్చుల తగ్గింపు, కాలుష్య నియంత్రణ, విద్యుత్ వాహనాల వినియోగం వంటి అంశాల్లో ఈ ప్రాజెక్టు సంస్థకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

