ఎల్‌నినో ప్రభావం
* హైరిస్క్ జాబితాలో భారత్ గ్రేడ్-3
* అత్యవసర స్పందన ప్రారంభించిన WHO
* WHO కీలక హెచ్చరిక
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎల్‌నినో ప్రభావంతో (El Nino Health Risks) ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో మార్పులు చోటుచేసుకోవడం వంటి పరిణామాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా గ్రేడ్-3 అత్యవసర స్పందనను ప్రారంభించింది. WHO సెప్టెంబర్ 2026లో విడుదల చేసిన ప్రజారోగ్య పరిస్థితుల విశ్లేషణలో భారత్‌ను అధిక లేదా అత్యధిక ఆరోగ్య ముప్పు ఎదుర్కొనే దేశాల జాబితాలో చేర్చింది.
* గ్రేడ్-3 స్పందన అంటే ఏమిటి..?
WHO అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మూడు స్థాయిల్లో స్పందనను వర్గీకరిస్తుంది. వీటిలో గ్రేడ్-3 అత్యున్నత స్థాయి. ఈ స్థాయి అమల్లోకి వస్తే సంస్థ తన ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, దేశాల కార్యాలయాల వనరులను సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతుంది. ఎల్‌నినో కారణంగా ఏర్పడే ఆరోగ్య ముప్పులను దృష్టిలో పెట్టుకుని WHO ఈ స్థాయి స్పందనను ప్రారంభించింది. ఇది భారత్‌కు మాత్రమే ప్రకటించిన అత్యవసర పరిస్థితి కాదు.
* భారత్‌కు ఎలాంటి ముప్పులు..?
ఎల్‌నినో ((El Nino Health Risks) ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, కరువు పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావంతో తాగునీటి కొరత, ఆహార భద్రత సమస్యలు, పోషకాహార లోపం వంటి పరిణామాలు తలెత్తవచ్చు. డెంగ్యూ, కలరా వంటి నీటి ద్వారా లేదా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని WHO పేర్కొంది.
* 2027లోనూ కొనసాగనున్న వాతావరణ ప్రభావాలు..
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనాల ప్రకారం 2026-27 ఎల్‌నినో ప్రభావం ప్రపంచ ఉష్ణోగ్రతలు, వర్షపాత సరళిపై ప్రభావం చూపనుంది. 2026 చివరి నెలల్లో ఎల్‌నినో బలపడే అవకాశాలున్నాయని, 2027 ప్రారంభంలోనూ దాని ప్రభావాలు కొనసాగవచ్చని అంచనా వేసింది. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే తరహా వాతావరణ పరిస్థితులు ఉండవని, ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.
* ఆరోగ్య, వ్యవసాయ రంగాలు అప్రమత్తంగా ఉండాలి..
వాతావరణ మార్పుల ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గడం, నీటి లభ్యత తగ్గడం, ఆహార ధరలపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తప్పదని ఇప్పుడే నిర్ధారించలేం. పరిస్థితులను ముందుగానే అంచనా వేసి వ్యవసాయ, ఆరోగ్య రంగాలు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూడడం, అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో ఉంచడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలకు WHO ప్రాధాన్యత ఇస్తోంది. 2026 అక్టోబర్ నుంచి 2027 సెప్టెంబర్ వరకు అమలయ్యేలా ప్రపంచవ్యాప్త సన్నద్ధత, స్పందన ప్రణాళికను రూపొందించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

